భారత క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక టీమ్‌ఇండియా కోచ్ పదవికి గుడ్‌బై చెప్పేస్తానని రవిశాస్త్రి బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత అతడు వీడ్కోలు పలకనున్నాడు! ఇప్పటికే అతడికి 59 ఏళ్లు నిండాయి. కోచ్ పదవికి వయో పరిమితి 60 ఏళ్లే. పైగా సుదీర్ఘ కాలంగా ఆ పదవిలో ఉన్నాడు. దీంతో అటు రవిశాస్త్రి, ఇటు బీసీసీఐ ఇతర మార్గాలు అన్వేషిస్తున్నారని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ప్రపంచకప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి ఒప్పందం ముగుస్తుంది. దాంతో బీసీసీఐ మళ్లీ ప్రధాన కోచ్, సహాయ కోచ్‌ల కోసం కొత్తగా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కోచ్ పదవికి వయో పరిమితి ఎప్పటిలాగే 60 ఏళ్లు ఉంటుంది. దరఖాస్తులు చేసిన వారిని బీసీసీఐ నియమించే క్రికెట్ కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది. ఒకవేళ రవిశాస్త్రి పోటీలో లేకుంటే రాహుల్ ద్రవిడ్ ఎంపికవ్వడం లాంఛనమే!
ఇప్పటికే ద్రవిడ్ అండర్-19, భారత్-ఏ కోచ్‌గా విజయవంతం అయ్యాడు. ఎన్‌సీఏ చీఫ్‌గా రిజర్వు బెంచిని పటిష్ఠంగా మార్చాడు. భారత జట్టులోని అందరితో అతడికి మంచి అనుబంధం ఉంది. పైగా ఈ మధ్యే శ్రీలంకలో భారత జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. తాజాగా ఎన్‌సీఏ చీఫ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించడమూ అతడి ఎంపికకు సంకేతాలు ఇస్తోంది.
"కుర్రాళ్లతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించా. ఇదెంతో బాగుంది. ఇప్పటికైతే నేనేమీ ఆలోచించలేదు. పూర్తి స్థాయి కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఎన్నో సవాళ్లు ఉంటాయి. అందుకే చేపడతానో లేదో తెలియదు."