Rashid Khan Ratan Tata 10 Crore Reward :అఫ్గానిస్థాన్ అగ్రశ్రేణి క్రికెటర్ రషీద్ ఖాన్‌కు తాను రూ.10 కోట్లు రివార్డు ప్రకటించినట్లు ఇటీవల సోషల్ మీడియాలో జరుతున్న ప్రచారాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఖండించారు. ఆ వార్తలను కొట్టిపారేస్తూ సోమవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాంటి వాట్సాప్ ఫార్వర్డ్ సందేశాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తాను ఏ క్రికెటర్ తరఫునా మాట్లాడలేదని అన్నారు.
వివరాల్లోకి వెళ్తే...
Rashid Khan Indian Flag :2023 ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. అయితే, ఈ మ్యాచ్ తర్వాత రషీద్ ఖాన్.. భారత జాతీయ పతాకాన్ని పట్టుకొని సంబరాలు చేసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో అతడికి ఐసీసీ రూ.55 లక్షలు జరిమానా విధించిందని ప్రచారమైంది. ఈ విషయాన్ని కొందరు నెటిజన్లు పోస్ట్ చేశారు. దీనికి రతన్ టాటా స్పందించి రషీద్ ఖాన్‌కు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారని ఆ పోస్టుల్లో పేర్కొన్నారు.
'నా నుంచి వస్తే తప్ప నమ్మొద్దు'
ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన నేపథ్యంలో రతన్ టాటా దీనిపై స్పందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తనకు క్రికెట్‌తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఏ ఆటగాడి జరిమానా గురించి.. తాను ఐసీసీకి గానీ, ఇతర క్రికెట్ సంస్థలకు గానీ ఎలాంటి సూచనలు చేయలేదని స్పష్టం చేశారు. ఏ ఆటగాడికీ రివార్డు ప్రకటించలేదని చెప్పారు. 'నా నుంచి అధికారికంగా సమాచారం వస్తే కానీ ఇలాంటి వాట్సప్ ఫార్వర్డ్ సందేశాలు, తప్పుడు వీడియోలు నమ్మొద్దు' అని రతన్ టాటా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.