తెలంగాణ

telangana

రషీద్‌ ఖాన్‌ ట్వీట్.. ఎంత ఆవేదనతో చేశాడో!

By

Published : Aug 19, 2021, 8:11 PM IST

అఫ్గానిస్థాన్​ తిరిగి తాలిబాన్ల అరాచక పాలనలోకి జారుకోవడంపై ఆ దేశ స్టార్​ క్రికెటర్ రషీద్​ ఖాన్​ ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం అఫ్గాన్​ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.

rashid khan, afghan cricketer
రషీద్ ఖాన్

తన మాతృభూమి మళ్లీ తాలిబన్ల అరాచక పాలనలోకి జారుకున్న కారణంగా అఫ్గానిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ తల్లడిల్లుతున్నాడు. తన కుటుంబం ఎలా ఉందోనని బెంగ పడుతున్నాడు. గురువారం అఫ్గాన్‌ స్వాత్రంత్య్ర దినోత్సవం కావడం వల్ల దేశం పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. దేశభక్తుల త్యాగాలను మర్చిపోవద్దని పిలుపునిచ్చాడు.

"మన జాతికి విలువనిచ్చేందుకు ఈ రోజు కొంత సమయం తీసుకుందాం. అంతేకాదు, దేశభక్తుల త్యాగాలను మర్చిపోవద్దు. మన జాతి ఐక్యతతో వర్ధిల్లాలని, ప్రశాంతంగా ఉండాలని మనమంతా ప్రార్థన చేద్దాం. స్వాత్రంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు" అని రషీద్‌ ట్వీట్‌ చేశాడు. అతడు పోస్టు చేసిన చిత్రాలు హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. అఫ్గాన్‌ జాతీయ పతాకాన్ని చుంబిస్తున్న చిత్రాలను తన బుగ్గలపై అఫ్గాన్‌ పతాకం ముద్రించుకున్న చిత్రాలను అతడు పెట్టాడు.

ప్రస్తుతం అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకం మొదలైంది. అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవడం వల్ల తాలిబన్లు ఊహించిన దానికన్నా ముందుగానే దేశాన్ని ఆక్రమించుకున్నారు. దాంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉన్నారు. కొందరు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మొదట్లో శాంతిమంత్రం జపించిన తాలిబన్లు ఇప్పుడు హింసకు పాల్పడుతున్నారు. మరోవైపు రషీద్‌ లండన్‌లో ది హండ్రెడ్‌ టోర్నీ ఆడుతున్నాడు. తన కుటుంబం అఫ్గాన్‌లోనే ఉండటంతో వారిని ఎలా తరలించాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు. తన దేశాన్ని కాపాడాలంటూ ప్రపంచనేతలకు అతడు ట్వీట్‌ చేశాడు.

ఇదీ చదవండి:Rashid khan: 'అఫ్గాన్​ క్రికెటర్లు ఇద్దరూ​ ఐపీఎల్​లో ఆడతారు'

ABOUT THE AUTHOR

...view details