Rahul Dravid Simplicity :టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఎంత సింపుల్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి తన సింప్లిసిటీతో నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నాడు. శుక్రవారం అండర్ - 19 కూచ్ బిహార్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా కర్ణాటక - ఉత్తరాఖండ్ జట్లు తలపడ్డాయి. అయితే రాహుల్ పెద్ద కుమారుడు సమిత్ (18).. ఈ టోర్నీలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్లో తన కుమారుడి ఆట చూసేందుకు రాహుల్.. ఆయన సతీమణి విజేతతో కలిసి మైసూర్ వడయార్ స్టేడియానికి వచ్చాడు.
అయితే ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో కాకుండా.. సాధారణ వ్యక్తిలాగా తన భార్యతో కలిసి స్టేడియంలో మెట్లపై కూర్చొని తమ కుమారుడి ఆటను చూశాడు. టీమ్ఇండియా హెడ్ కోచ్ పొజిషన్లో ఉండి కూడా.. మామూలు వ్యక్తిలా మెట్లపై కూర్చోని మ్యాచ్ చూడడం స్థానికంగా అందర్నీ ఆకర్షించింది. 'అందరు తల్లిదండ్రుల లాగే నేనూ నా కుమారుడి ఆట చూడడానికి వచ్చా. ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదు' అని రాహుల్ అన్నాడు. ఇక గ్రౌండ్లో రాహుల్ కనిపించగానే.. ఫ్యాన్స్ సెల్ఫీ కోసం ఎగబడ్డారు.
ఇక మ్యాచ్విషయానికొస్తే.. ఉత్తరాఖండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసేసరికి ఉత్తరాఖండ్.. 232-9తో నిలిచింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ సమిత్.. 5 ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ తీసుకోకుండా 11 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక రెండో రోజు నేడు (శనివారం) ఆట కొనసాగుతోంది. ఇదే టోర్నీలో సమిత్.. హిమాచల్ ప్రదేశ్, దిల్లీ జట్లపై 50+ స్కోర్లు నమోదు చేశాడు. ఇక ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (14).. కర్ణాటక అండర్ - 14 జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్నాడు.