టెస్టు క్రికెట్‌లో 1990, 2000 దశకాల్లో ఆస్ట్రేలియా మేటి జట్టనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ, దాని దూకుడుకు కళ్లెం వేసింది టీమ్‌ఇండియా. 2000లో తొలిసారి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టులో సంచలన విజయం సాధించిన భారత జట్టు.. 2003లో మరోసారి వారి సొంతగడ్డపైనే గడగడలాడించింది. డిసెంబర్‌లో అడిలైడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ - వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి తమ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ మ్యాచ్ గురించి కొంతమందికి తెలిసినా.. చాలా మటుకు మరిచిపోయి ఉంటారు. అయితే, టీమ్‌ఇండియా సాధించిన గొప్ప విజయాల్లో ఒకటైన దీన్ని లాక్‌డౌన్ వేళ ఓ సారి గుర్తు చేసుకుందాం..
మానసికంగా దెబ్బకొట్టి..
అడిలైడ్ టెస్టులో రికీ పాంటింగ్ సారథ్యంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 556 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దాంతో భారత్‌ను ముందే మానసికంగా బెదరగొట్టింది. పాంటింగ్ (242; 352 బంతుల్లో 31x4) ఓర్పుతో బ్యాటింగ్ చేసి ద్విశతకం సాధించగా.. ఓపెనర్ లాంగర్ (58; 72 బంతుల్లో 7x4, 2x6), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సైమన్ కటిచ్ (75; 109 బంతుల్లో 9x4, 1x6) అర్ధశతకాలతో రాణించారు. ఈ క్రమంలోనే చివర్లో జేసన్ గిలెస్పీ (48; 53 బంతుల్లో 6x4) ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరును 550 దాటించాడు. టీమ్‌ఇండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఐదు వికెట్లు తీయగా ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇర్ఫాన్ పఠాన్ ఒక వికెట్ తీశాడు.
అదరని బెదరని ఈడెన్ హీరోలు..
ఆపై టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కినా ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. 66 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన గంగూలీ సేన 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దాంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆకాశ్ చోప్రా (27), వీరేంద్ర సెహ్వాగ్ (47), సచిన్ (1), గంగూలీ (2) విఫలమయ్యారు. ఇక మిగిలింది ద్రవిడ్, లక్ష్మణ్, పార్థివ్ పటేల్ మాత్రమే. ఒకవైపు కొండంత లక్ష్యం.. మరోవైపు భీకరమైన బౌలర్లు. అయినా పట్టుదలతో బ్యాటింగ్ చేశారు ఈడెన్ గార్డెన్స్ హీరోలు. ద్రవిడ్ (233; 446 బంతుల్లో 23x4, 1x6), లక్ష్మణ్ (148; 282 బంతుల్లో 18x4) కంగారూ బౌలర్లకు పరీక్ష పెట్టారు. చూడచక్కని షాట్లతో ఏ బౌలర్‌నూ వదలలేదు. గిలెస్పీ, ఆండీ బిచెల్, స్టువర్ట్ మాక్‌గిల్‌లను ఆటాడుకున్నారు. ఐదో వికెట్‌కు 303 పరుగులు జోడించి జట్టును పోటీలో నిలిపారు. ఇక 150కి చేరువైన వేళ లక్ష్మణ్ ఔటయ్యాక ద్రవిడ్ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టు స్కోరును 523కు చేరవేశాడు. దాంతో కంగారూలకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.