భారత టెస్టు జట్టులో అత్యంత విలువైన ఆటగాళ్లలో చెతేశ్వర్ పుజారా ఒకడు. గంటలు గంటలు క్రీజులో నిలిచే పుజారా మానసిక దృఢత్వం గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది. అలాంటి పుజారా ఒకప్పుడు కెరీర్ పట్ల తీవ్ర ఆందోళనతో ఏడ్చాడట. పూర్తి ప్రతికూల ఆలోచనలతో మానసిక వేదనకు గురయ్యాడట. తాను క్రికెట్లో కొనసాగలేనేమో అని భయపడ్డాడట. ఓ ఇంటర్వ్యూలో ఆ రోజులను అతను గుర్తు చేసుకున్నాడు.
"కెరీర్ ఆరంభంలో నాకు తొలిసారి పెద్ద గాయం అయింది. అది నా కెరీర్లోనే అత్యంత కఠిన సమయం. జట్టు ఫిజియో నా దగ్గరికొచ్చి కోలుకోవడానికి ఆరు నెలల దాకా సమయం పట్టొచ్చన్నాడు. నేను తీవ్ర నిరాశకు గురై ఏడ్చేశాను. అప్పుడు నా ఆలోచనలన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. మళ్లీ క్రికెట్ ఆడగలనా.. అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగగలనా అని సందేహాలు కలిగాయి" అని పుజారా చెప్పాడు.