Cue Sports Pankaj Adwani: మంచి నీళ్ల ప్రాయంగా ప్రపంచ టైటిళ్లు సాధించడం అలవాటు చేసుకున్న భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ పంకజ్ అడ్వాణీ మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. శనివారం ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్) ఛాంపియన్‌షిప్స్‌లో అతను జయకేతనం ఎగురవేశాడు. ఫైనల్లో 4-0 తేడాతో భారత్‌కే చెందిన సౌరభ్ కొఠారిపై విజయం సాధించాడు. ఇది పంకజ్‌కు 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. ఈ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా అయిదో టైటిల్. ఏడు ఫ్రేమ్‌ల ఫైనల్లో ఆరంభం నుంచే పంకజ్ దూకుడు ప్రదర్శించాడు.
తొలి ఫ్రేమ్‌లో ఆటతీరుతోనే టైటిల్ అతనిదేనని స్పష్టమైంది. ఆ తర్వాత వరుసగా మూడు ఫ్రేమ్‌లు గెలిచి మ్యాచ్ ముగించాడు. కరోనా కారణంగా మూడేళ్ల విరామం తర్వాత నిర్వహించిన టోర్నీలో పంకజ్ ఆధిపత్యాన్ని కొనసాగించాడు. రికార్డు స్థాయిలో అయిదోసారి ఒకే క్యాలెండర్ ఏడాదిలో జాతీయ, ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. "ఓ ప్రపంచ టైటిల్‌ను వరుసగా అయిదు సార్లు నిలబెట్టుకోవడం ఓ కల. ఈ ఏడాదిలో నా ఆటతీరు పట్ల, ఆడిన ప్రతి బిలియర్డ్స్ టోర్నీలోనూ విజేతగా నిలవడంపై ఎంతో సంతోషంగా ఉన్నా. ప్రపంచ స్థాయిలో దేశానికి మరో పసిడి అందించడాన్ని గౌరవంగా భావిస్తున్నా" అని పంకజ్ తెలిపాడు.