Pakistan Players Luggage Carrying Issue :మరో పది రోజుల్లో ఆస్ట్రేలియాతో, పాకిస్థాన్ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే సిడ్నీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత, పాక్ ప్లేయర్లు వాళ్ల లగేజ్ వారే మోస్తూ ట్రక్కులో ఎక్కించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన ఆతిథ్య ప్లేయర్లను పట్టించుకోలేదంటూ కంగారూ బోర్డుపై విమర్శలు వచ్చాయి. ఇలా చేయడం ఆస్ట్రేలియాకు కొత్త కాదంటూ నెటిజన్లు కంగారూ బోర్డుకు చురకలు అంటించారు. గతంలో కూడా అగ్ర జట్లకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేక క్రికెట్ ప్రియుల ఆగ్రహానికి గురైందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ విషయంపై స్పందించాడు పాకిస్థాన్ పేస్ బౌలర్ షహీన్ అఫ్రిదీ. తమ జట్టు ప్లేయర్లంతా స్వయంగా లగేజ్ ఎందుకు మోయాల్సి వచ్చిందో చెప్పాడు. కాన్బెర్రాలో ప్రాక్టీస్ సెషన్ జరుగుతున్న సమయంలో షహీన్ క్లారిటీ ఇచ్చాడు. 'మరో విమానాన్ని అందుకునేందుకు మాకు 30 నిమిషాల టైమ్ మాత్రమే ఉంది. అక్కడ కేవలం ఇద్దరు సిబ్బంది మాతో ఉన్నారు. అందుకే టైమ్ సేవ్ చేసేందుకే మేము వారికి హెల్ప్ చేశాం. జట్టును మేం ఫ్యామిలీగా భావిస్తాం. అందుకే ఒకరికొకరం సహాయం చేసుకున్నాం' అని అన్నాడు.
అయితే తమ దేశానికి వచ్చిన జట్టుకు స్వాగతం పలకడం సదరు ఆతిథ్య క్రికెట్ బోర్డు కనీస కర్తవ్యం. వారు పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లేవరకు ప్లేయర్ల భద్రత, బస వంటి అన్నింటిని సౌకర్యాలను వారికి కలిగించాలి. ఎలాంటి ఆటంకం లేకుండా వారు మ్యాచ్ల్లో పాల్గొనేలాగా చూడాలి. ఇవి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు.