న్యూజిలాండ్ జట్టు ఇటీవల పాక్‌తో జరగాల్సిన క్రికెట్ టోర్నీని(Pak Cricket News) చివరి నిమిషంలో రద్దు చేసుకొని తిరుగుప్రయాణమైంది. దీంతో ఆ దేశ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, బాబర్ ఆజామ్, మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్‌లు న్యూజిలాండ్ క్రికెటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వారు ఇక్కడ ఒక్క విషయం గమనించలేదు.. ప్రాణం అంటే ఎవరికి చేదు..? ఓ పక్క పాక్ ప్రధాని 'మా దేశంలో 40 వేల మంది ఉగ్రవాదులున్నారు'..,'విదేశీ సంకెళ్లను తెంచుకొన్న అఫ్గాన్', 'ముజాహుద్దీన్‌లు మా హీరోలు' అంటూ తాలిబన్ నేతలకు పోటీగా ప్రకటనలు చేశారు.
అంతేకాదు గతంలో తాలిబన్లతో కలిసి ఫొటోలు దిగిన చరిత్ర కూడా ఇమ్రాన్‌కు ఉంది. ఆయన్ను ప్రత్యర్థులు 'తాలిబన్ ఖాన్'(Imran Khan News) అని పిలుస్తారు. ఇక ఆ దేశ మాజీ క్రీడాకారుడు షాహిద్ అఫ్రిదీ కూడా ఇమ్రాన్‌తో గళం కలిపాడు. తాలిబన్లు సానుకూల దృక్పథంతో అధికారంలోకి వచ్చారని పొగడ్తలతో ముంచెత్తారు.
గతంలోనూ..
గతంలో ఒసామా బిన్ లాడెన్ తమ హీరో అని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బహిరంగంగానే పేర్కొన్నారు. ఇది వారి భావజాలాన్ని తెలియజేస్తోంది. పాక్‌లో ఉగ్రవాదానికి లభించే మద్దతుకు ఈప్రకటనలే నిదర్శనం. పాక్ పెంచి పోషించిన ఉగ్రపాములు ఇప్పుడు ఆ దేశాన్ని కాటేస్తున్నాయి. ఐదు కీలక దేశాల ఇంటెలిజెన్స్ అలయన్స్ 'ఫైవ్ ఐస్' హెచ్చరికలు వెలువడగానే న్యూజిలాండ్ బృందం ఏమాత్రం ఆలోచించకుండా స్వదేశానికి బయల్దేరింది.
దూషాన్‌బేలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు(Imran Khan News) విషయం తెలిసిన వెంటనే న్యూజిలాండ్ ప్రధాని జసెండా అర్డెన్‌కు ఫోన్ చేసి మ్యాచ్‌ను కొనసాగించేందుకు ప్రయత్నించారు. కానీ, ఫైవ్‌ఐస్ హెచ్చరికల నేపథ్యంలో జసెండా కూడా ఏమీ చేయలేకపోయారు. 4,000 మంది పాక్ సైన్యం, ఎస్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసులను మోహరిస్తామన్నా ఆమె పట్టించుకోలేదు.
ఏమిటీ 'ఫైవ్ ఐస్'..?
'ఫైవ్ ఐస్' అనేది ఐదు దేశాలు కలసి సమష్టిగా ఏర్పాటు చేసుకొన్న ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్. దీనిలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లు సభ్య దేశాలు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, యూకే మధ్య ఇంటెలిజెన్స్ మార్పిడీపై చర్చలు జరిగేవి. 1946లో వీరు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ తర్వాత ఈ కూటమిలోకి కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను కూడా చేర్చారు. భవిష్యత్తులో మరింత విస్తరించి కొరియా, భారత్, జపాన్, జర్మనీలను కూడా చేర్చుకోవాలనే చర్చలు జరుగుతున్నాయి. సముద్రాలపై నిఘా, కోవర్ట్ సమాచారం, హ్యూమన్ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తాయి. వీటిని మిత్రదేశాలతో పంచుకొంటాయి.
పాక్ సైన్యాన్ని నమ్మవచ్చా..?
ఉగ్రవాదంలో భాగస్వాములు కావడం సహా.. ముష్కరులకు మద్దతు ఇచ్చిన చరిత్ర పాక్‌కు ఉంది. పాక్ సైన్యంలోని 4వ కోర్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించిన లెఫ్టినెంట్ జనరల్ షాహిద్ అజిజ్ ఏకంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలో చేరాడు. అల్‌ఖైదా, ఐసిస్ తరఫున సిరియాలో జరిగిన దాడుల్లో పాల్గొన్నాడు.
మాజీ ఐఎస్‌ఐ చీఫ్ హమీద్ గుల్ ఉగ్రవాదానికి అతిపెద్ద మద్దతుదారు. ఉగ్ర సంస్థలతో సంబంధాలు పెట్టుకొని శిక్షలు అనుభవించిన జనరల్స్ కూడా పాక్ ఆర్మీలో ఉన్నారు. జనరల్ జియా ఉల్ హక్ సమయం నుంచి పాక్ సైన్యంలో మత ఛాందసం పెరిగిపోయింది.