ODI World Cup 2023 Srilanka VS Australia : ప్రస్తుతం వరల్డ్ కప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభమై దాదపు పది రోజులు అయిపోయింది. సెంచరీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. అయితే ఈ ప్రపంచకప్‌లో నెక్ట్స్ జరగబోయేది 14వ మ్యాచ్. ఆస్ట్రేలియా - శ్రీలంక మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ప్రస్తుత టోర్నీలో ఖాతా తెరవలేదు. తలో రెండు మ్యాచులు ఆడాయి కానీ ఒక్క దాంట్లో కూడా నెగ్గలేదు. ఈ నేపథ్యంలో లంక జట్టుతో పాటు ఆసీస్‌లో ఏ ప్లేయర్స్‌పై ఆశలు ఉన్నాయో తెలుసుకుందాం..
1. కుశాల్ మెండిస్.. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన కుశాల్ మెండిస్.. రీసెంట్గా జరిగిన ఆసియా కప్‌లో తన జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎక్కువ సేపు క్రీజులో నిలిచి ఇన్నింగ్స్ ఆడటంలో ఇతను ఎక్స్పర్ట్. చాలా రోజులుగా లంక టీమ్‌కు ఆడుతూ.. మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు. ఇప్పటిదాకా 114 వన్డేల్లో 3,413 పరుగులు సాధించాడు. మెండిస్ యావరేజ్ 32.15, స్ట్రైక్ రేట్ 84.44 గా ఉంది. ఈ ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ అద్భుతంగా అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాడు. ఓ సెంచరీ కూడా బాదాడు. ఆడిన రెండు మ్యాచుల్లో 76, 122 పరుగులు చేశాడు. అసలీ ప్రపంచకప్‌లో శ్రీలంకకు ఆశ కుశాల్ మెండిసే. తొలి రెండు మ్యాచ్‌లో ఆ జట్టు ఓడినా.. చివరి వరకు పోరాడిందంటే కారణం కుశాల్. మున్ముందు మ్యాచ్‌ల్లోనూ అతడు ఇలాగే చెలరేగాలని లంక కోరుకుంటోంది.
2. దాసున్ శనక.. శ్రీలంక కెప్టెన్ అయిన దాసున్ శనక.. ఈ టీమ్‌లో ప్రాముఖ్యం కలిగిన ఆటగాళ్లలో ఒకడు. తన నాయకత్వంతో జట్టును నడిపించడమే కాకుండా.. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ రాణిస్తాడు. మరోవైపు ఫినిషర్ పాత్రనూ పోషించగలడు. శనక 69 మ్యాచుల్లో 1104 పరుగులు సాధించాడు. 5.72 ఎకానమీతో 27 వికెట్లనూ తీశాడు. ఈ ప్రపంచకప్‌లో వికెట్లు తీయలేదు కానీ.. పరుగులు మంచి సాధించాడు. ఆడిన రెండు మ్యాచుల్లో 68, 12 పరుగులు చేశాడు.
3. ధనంజయ డిసిల్వా.. శ్రీలంక జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్. ఇటు బ్యాట్‌తో అటు బాల్‌తోనూ రాణించగలడు. బౌలింగ్‌లో తన స్వింగ్‌తో, బ్యాటింగ్‌లో తన బ్రిలియంట్ హిట్టింగ్తో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచగలడు. ఇప్పటిదాకా 84 వన్డేలాడిన డిసిల్వా.. 1761 పరుగులు చేశాడు. 44 వికెట్లు పడగొట్టాడు. కానీ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో 11, 25 పరుగులు మాత్రమే చేశాడు. నెక్ట్స్ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో..
4. మతిశా పతిరన.. యార్కర్ కింగ్ మలింగను పోలిన బౌలింగ్ యాక్షన్‌తో జూనియర్ మలింగగా పేరు తెచ్చుకున్నాడు ఇతడు. తన పదునైన యార్కర్లతో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడతాడు.. ఇతడికి కూడా ఇండియన్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఎక్కువగానే ఉంది. తీక్షణతో పాటే పతిరన కూడా చెన్నై తరఫునే ఆడాడు. ఐపీఎల్లో ఆ జట్టుకు కీలక బౌలర్‌గా సేవలందించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఒక వైపు పరుగులు ఆపుతూ మరోవైపు వికెట్లు పడగొట్టాడు. ఇతను తన కెరీర్లో ఇప్పటివరకు 12 వన్డేలు ఆడి 17 వికెట్లు పడగొట్టాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రెండు మ్యాచులు ఆడి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 5, 1నాటౌట్ పరుగులు మాత్రమే చేశాడు. 2 వికెట్లు పడగొట్టాడు. మరి ఆస్ట్రైలియాపై ఎలా రాణిస్తాడో చూడాలి..