ODI World Cup 2023 South Africa Vs Srilanka : వరల్డ్ కప్‌లో భాగంగా నేడు(అక్టోబర్ 7) దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. 429 లక్ష్యంతో బరిలోకి దిగిన లంక గట్టిగానే పోరాడినా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 44.5 ఓవర్లలో 326 పరుగులు చేసి ఓటమిని అందుకుంది. ఫలితంగా దక్షిణాఫ్రికా 102 పరుగులు తేడాతో విజయం సాధించింది. లంక బ్యాటర్లలో చరిత్ అషలంక(79), కుశాల్ మెండిస్(76), డసన్ షనక(68) మంచిగా రాణించారు. కసున్ రజిత(33), సదీరా సమరవిక్రమాక్(23) పర్వాలేదనిపించారు. గెరాల్డ్ 3, మార్కో జాన్సన్ 2, కగిసో రబాడా 2, కేశవ్ మహారాజ్ 2, లుంగి నిగిడి ఓ వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టులో.. ఏకంగా ముగ్గురు ప్లేయర్లు శతకాలతో విరుచుకుపడ్డారు. దీంతో వరల్డ్ కప్ హిస్టరీలోనే అత్యధిక స్కోరు నమోదైంది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 428 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 x 4, 3 x 6), వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 x 4, 2 x 6) సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఐడెన్ మార్‌క్రమ్ (54 బంతుల్లో 106; 14 x 4, 3 x 6) మెరుపు సెంచరీతో రెచ్చిపోయాడు. క్లాసెన్ (20 బంతుల్లో 32; 1 x 4, 3 x 6), డేవిడ్ మిల్లర్ (21 బంతుల్లో 39*; 3 x 4, 2 x 6) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మధుశంక 2, కాసున్ రజిత, పతిరన, వెల్లలాగె ఒక్కో వికెట్ తీశారు. అయితే పతిరన , రజిత, వెల్లలాగె ఏకంగా 95, 90, 81 పరుగులు సమర్పించుకున్నారు.
ఫాసెస్ట్ సెంచరీ.. డికాక్ సెంచరీ కొట్టి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మార్‌క్రమ్.. ఆరంభంలో నెమ్మదిగా ఆడినా తర్వాత లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన అతడు.. మరో 15 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకోవడం విశేషం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో మార్‌క్రమ్ 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని రికార్డు క్రియేట్ చేశాడు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లోనే శతకం బాదిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఐర్లాండ్ ప్లేయర్ కెవిన్ ఓబ్రియన్ (50 బంతులు) పేరిట ఉంది.