ప్రపంచకప్ టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల(Ind vs Pak T20 World Cup) రికార్డులు, గణాంకాలు ఇరు జట్లలోని ఆటగాళ్లలో ఎవరూ పట్టించుకోరని, అది కేవలం గణాంకాలు నమోదు చేసే వ్యక్తి పని మాత్రమేనని ఆ జట్టు దిగ్గజ పేసర్ వసీమ్ అక్రమ్(Wasim Akram News) అభిప్రాయపడ్డాడు. ఆదివారం దాయాది జట్ల మధ్య 2021 టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) తొలి మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. దుబాయ్‌లో నిర్వహిస్తోన్న సలాం క్రికెట్ కార్యక్రమంలో అక్రమ్ పాల్గొన్నాడు.
"ప్రపంచకప్‌ల్లో మేం భారత్‌ను ఓడించలేదనేది నిజమే. కానీ, ఇరుజట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ ఎక్కువ విజయాలు సాధించింది. నేను వాళ్లతో ఐదు వన్డే ప్రపంచకప్‌లు ఆడినా ఇప్పటికీ టీమ్‌ఇండియాపై ఒక్క మ్యాచ్ గెలవలేదు. అది అంగీకరిస్తా. అయితే, భారత్-పాక్ ఆటగాళ్లు ప్రపంచకప్ టోర్నీల్లో బరిలోకి దిగేటప్పుడు ఇవన్నీ పట్టించుకోరు. అది గణాంకాలు నమోదు చేసే వ్యక్తి చూసుకుంటాడు. ఒక ఆటగాడిగా నాకూ, లేదా పాకిస్థాన్ ఆటగాళ్లకు, లేదా టీమ్ఇండియా ఆటగాళ్లకు ఎవ్వరికీ ఈ రికార్డులతో పనిలేదు."
-వసీమ్ అక్రమ్, పాక్ మాజీ అటగాడు.
ప్రపంచకప్ ఈవెంట్లలో(T20 World Cup 2021) ప్రతి మ్యాచ్ ముఖ్యమేనని, ప్రతి జట్టూ విజయం కోసమే ఆడతాయని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. అయితే, భారత్-పాక్ మ్యాచ్(Ind vs Pak T20) అంటే ఎక్కువ ప్రాధాన్యమని తెలిపాడు. ప్రపంచకప్ ఈవెంట్‌లోనే ఇదో పెద్ద మ్యాచ్‌గా నిలుస్తుందన్నాడు. దీంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పాడు. అలాగే మ్యాచ్ ప్రారంభమయ్యాక ఇవన్నీ ఏం గుర్తుకురావన్నాడు. ఆటగాళ్లంతా అక్కడ ఎలా గెలవాలనే ఆలోచిస్తారన్నాడు. ఇలాంటి మ్యాచ్‌ల్లో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనౌతారని.. కానీ అందరూ కాస్త అదుపులో ఉండాలని వసీమ్ అక్రమ్ సూచించాడు.