తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final: ప్రశాంతమే కానీ ప్రమాదం

ఈ ఏడాది జనవరిలో టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకుని.. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)పై కన్నేసిన జట్టు.. న్యూజిలాండ్‌. ఇటీవల అద్భుత ప్రదర్శనతో సత్తాచాటుతోన్న కివీస్‌.. శుక్రవారం ఆరంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్‌ఇండియాతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓ సారి ప్రత్యర్థి జట్టు ఎలా ఉందో చూసేద్దాం!

NewZealand
న్యూజిలాండ్‌

By

Published : Jun 17, 2021, 7:31 AM IST

భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌.. టెస్టు క్రికెట్లో చాలా ఏళ్లుగా ఈ జట్లదే ఆధిపత్యం. కానీ ఇప్పుడు ఈ జాబితాలో తానూ ఉన్నానంటూ న్యూజిలాండ్‌ దూసుకొస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో(WTC Final) చోటు కోసం టీమ్‌ఇండియాతో సహా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ఎంతో కష్టపడితే.. న్యూజిలాండ్‌ మాత్రం నిలకడగా రాణించి ముందే ఆ బెర్తు దక్కించుకుంది. తాజాగా టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను దాని సొంతగడ్డపైనే ఓడించి.. భారత్‌తో ఫైనల్‌కు అన్ని విధాలుగా సిద్ధమైంది. అందుకే ఈ పోరులో ఆ జట్టే ఫేవరేట్‌ అని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. ఈ ఫైనల్‌ జరిగే ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లోని పరిస్థితులు న్యూజిలాండ్‌లోలాగే ఉంటాయి. దీంతో ఆ జట్టుకే ఎక్కువ ప్రయోజనమన్న అభిప్రాయాలూ వినబడుతున్నాయి.

అన్నీ తానై..

తిరుగులేని బ్యాటింగ్‌.. అదరగొట్టే బౌలింగ్‌.. దూకుడైన ఫీల్డింగ్‌.. ఇలా అన్ని రంగాల్లో న్యూజిలాండ్‌ పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో ప్రధాన ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుని, జట్టులో ఆరు మార్పులు చేసినప్పటికీ కివీస్‌ విజయం సాధించడం ఆ జట్టు రిజర్వ్‌ బెంచ్‌ బలాన్ని చాటిచెబుతోంది. టీమ్‌ఇండియాకు ఉన్నట్లుగానే ఆ జట్టుకూ ఉత్తమ వనరులున్నాయి. ముఖ్యంగా నాయకుడు విలియమ్సన్‌ ఆ జట్టుకు కొండంత అండ. ఇప్పటివరకూ కెప్టెన్‌గా 36 టెస్టుల్లో జట్టుకు 21 విజయాలు అందించాడు. కేవలం ఎనిమిది మ్యాచ్‌ల్లోనే ఓడిన జట్టు.. మరో ఏడు డ్రాలు చేసుకుంది. బ్యాట్స్‌మన్‌గాను అతనెంతో కీలకం. కెప్టెన్సీ తనకు భారమే కాదన్నట్లు నాయకుడిగా ఉన్న 36 టెస్టుల్లో 60.62 సగటుతో 3092 పరుగులు చేశాడు. మొత్తంగా 84 మ్యాచ్‌ల్లో 53.60 సగటుతో 7129 పరుగులు సాధించాడు.

విలియమ్సన్

పటిష్ఠంగా మారి..

కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ విభాగం ఎంతో పటిష్ఠంగా తయారైంది. విలియమ్సన్‌(kane williamson)కు తోడు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుత జట్టులోనే అత్యంత అనుభవజ్ఞుడైన రాస్‌ టేలర్‌.. 37 ఏళ్ల వయసులోనూ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆ జట్టులోని మరో కీలక బ్యాట్స్‌మన్‌ టామ్‌ లాథమ్‌. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీసి సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం ఈ ఓపెనర్‌ సొంతం. కొత్త ఓపెనర్‌ కాన్వేతోనూ ప్రమాదమే. అతనితో పాటు నికోలస్, వాట్లింగ్‌, బ్లండెల్‌తో కూడిన ఆ జట్టు బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. పేస్‌ ఆల్‌రౌండర్లు గ్రాండ్‌హోమ్‌, జెమీసన్‌ బ్యాటుతోనూ మెరుపులు మెరిపించగలరు.

న్యూజిలాండ్‌

భయపెట్టే దళం..

బౌలింగ్‌లోనూ ఆ జట్టుకు ఎదురులేదు. అగ్రశ్రేణి సీనియర్‌ పేస్‌ ద్వయం బౌల్ట్‌, సౌథీతో పాటు వాగ్నర్‌, జెమీసన్‌, హెన్రీ, గ్రాండ్‌హోమ్‌, స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ రూపంలో ఆ జట్టుకు గొప్ప బౌలింగ్‌ దళం ఉంది. ముఖ్యంగా చాలా ఏళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బౌల్ట్‌, సౌథీ ఇప్పటికీ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. ప్రపంచ అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌నూ వీళ్లు కకావికలం చేయగలరు. ఇటీవల ఇంగ్లాండ్‌తో టెస్టుల్లో రాణించిన వీళ్లు.. భారత్‌కు సవాలు విసిరేందుకు సిద్ధమయ్యారు. మెరుపు వేగంతో బంతులేసే వాగ్నర్‌ ఎప్పట్లాగే వికెట్ల పండగ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్న అతను.. 53 మ్యాచ్‌ల్లో 226 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్రం నుంచి ఆకట్టుకుంటున్న పొడగరి పేసర్‌ జెమీసన్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 15.15 సగటుతో 39 వికెట్లు తీసిన అతను భారత్‌పై సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు. స్పిన్నర్‌ అజాజ్‌ కూడా తక్కువోడేమీ కాదు.

ఇవీ చూడండి: Rohit Sharma: రోహిత్‌ను స్లెడ్జింగ్‌ చేసిన బౌల్ట్‌!

ABOUT THE AUTHOR

...view details