Hardik Recovery: ఐపీఎల్ పునరాగమనంలో హార్దిక్ పాండ్య సత్తాచాటుతున్నాడు. కొత్త టీం గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న పాండ్య.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిపించాడు. వ్యక్తిగతంగానూ బ్యాటింగ్ మాత్రమే కాకుండా.. బౌలింగ్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు. కొంతకాలం కింద.. ఫిట్నెస్ లేమి, వరుస వైఫల్యాలు, గాయాలతో ఇబ్బందిపడి జట్టులో చోటు కోల్పోయిన పాండ్య ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. 2019 తర్వాత.. అతడు ఐపీఎల్లో బౌలింగ్ చేయడం ఈ సీజన్లోనే తొలిసారి కావడం విశేషం.
గతేడాది టీమ్ఇండియాకు రాణించలేకపోతున్న సమయంలోనూ.. తాను ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నానని, తనను కేవలం బ్యాటర్‌గానే పరిగణనలోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. 2021 టీ-20 వరల్డ్‌కప్‌లో పాండ్య చివరిసారి టీమ్ఇండియా తరఫున ఆడాడు. అనంతరం.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకు జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా కొత్త అవతారంలో ఆకట్టుకుంటున్నాడు. హార్దిక్ బలంగా పుంజుకోవడానికి.. అతడి సోదరుడు కృనాల్ పాండ్య కీలక పాత్ర పోషించి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా. కెరీల్లో అత్యంత క్లిష్టమైన దశలో.. హార్దిక్‌కు కృనాల్ నుంచి మద్దతు, సహకారం లభించిందని అన్నాడు.
''హార్దిక్ పాండ్య పునరాగమనం ప్రశంసనీయం. ఒక ఆటగాడు గాయాలబారిన పడి కోలుకోవడంలో.. కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. పాండ్య బౌలింగ్ చేస్తుంటే.. అతని భార్య చాలా సంతోషంగా ఉంది. పాండ్యకు.. కావాల్సినంత సహకారం అందించాడు కృనాల్. హార్దిక్ ఇప్పుడు చక్కగా రాణిస్తున్నాడు. ఫిట్‌గా కనిపిస్తూ.. బాల్‌తో చక్కటి పేస్ రాబడుతున్నాడు. ఇది గుజరాత్ టైటాన్స్‌కు మంచి చేస్తుంది.''