Jay Shah Arjuna Ranatunga Comments : భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షాపై మాజీ శ్రీలంక క్రికెటర్ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలకై ఆ దేశ ప్రభుత్వం స్పందించింది. రణతుంగ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసింది. జైషాపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది. శుక్రవారం జరిగిన శ్రీలంక పార్లమెంట్ సమావేశాల్లో మంత్రులు హరీన్ ఫెర్నాండో, కాంచన విజేశేఖర ప్రకటించారు.
'జై షాపై కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను శ్రీలంక ప్రభుత్వం ఖండిస్తోంది. మా క్రికెట్ బోర్డులోని లోపాలను ఏసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఆపాదించలేం. అది పూర్తిగా తప్పుడు భావన' అని మంత్రి విజేశేఖర పార్లమెంట్లో ప్రకటించారు. దీంతో పాటు శ్రీలంక క్రికెట్ బోర్డు- ఎస్ఎల్సీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని జై షాను శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కోరినట్లు మంత్రి హరీన్ ఫెర్నాండో వెల్లడించారు. లేకుంటే నిషేధం ప్రభావం వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌పై పడే అవకాశం ఉందని చెప్పారు. ఐసీసీ నిషేధం ఎత్తేయకుంటే.. శ్రీలంకకు ఎవరూ రారని.. క్రికెట్ టోర్నమెంట్ ద్వారా శ్రీలంకకు ఆర్థికంగా ఎలాంటి లాభం ఉండదు అని హరీన్ ఫెర్నాండో పేర్కొన్నారు.