వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్‌పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్‌లో భారత్ పర్యటించేది లేదని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పిన నేపథ్యంలో.. ఇరు దేశాల బోర్డుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ కూడా స్పందించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించేవరకూ భారత్-పాక్ మధ్య ఎలాంటి క్రికెట్ సంబంధాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి.. అయితే ప్రభుత్వ విధానాలు, వైఖరి ఏంటో మీరు తెలుసుకోవాలి. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదో క్లిష్టమైన సమస్య. మీ తలపై గన్ పెడితే.. మీరు నాతో మాట్లాడుతారా?. మీ పొరుగువారు బహిరంగంగా ఉగ్రవాదానికి సహాయం అందిస్తుంటే.. అక్కడ నాయకులు ఎవరు? క్యాంపులు ఎక్కడ ఉన్నాయనే దానిలో రహస్యమేముంటుంది. సీమాంతర ఉగ్రవాదమనేది సాధారణ విషయమని మనం ఎప్పుడూ అనుకోకూడదు. పొరుగు దేశాలపైనే ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే ఘటనలు ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నాయా? అలాంటిది ఎక్కడా లేదు.. కాబట్టి ఇది అత్యంత అసాధారణమైనది" అని జై శంకర్ అన్నారు.