Henry Nicholls Dismissal: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు హెన్రీ నికోల్స్ (19) విచిత్రమైన పరిస్థితుల్లో ఔటయ్యాడు. గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ ఆట ముగిసే సమయానికి 225/5తో నిలిచింది. డారిల్ మిచెల్ (78; 159 బంతుల్లో 6x4, 2x6), టామ్ బ్లండెల్ (45; 108 బంతుల్లో 5x4) నాటౌట్‌గా ఉన్నారు. అయితే, టీ విరామానికి ముందు నికోల్స్‌ను దురదృష్టం వెంటాడంతో అనూహ్యంగా ఔటయ్యాడు.
అసలేం జరిగిదంటే.. న్యూజిలాండ్ 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడటంతో నికోల్స్, మిచెల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రెండో సెషన్ ముగిసే ముందు లీచ్ బౌలింగ్‌లో చివరి బంతిని ఎదుర్కొన్న నికోల్స్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి కాస్తా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో నిల్చున్న మిచెల్ వైపు దూసుకురావడంతో తప్పించుకునేందుకు చూశాడు. ఆ క్రమంలో బంతి అతడి బ్యాట్‌కు తాకి మిడాఫ్‌లో గాల్లోకి లేచింది. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అలెక్స్ అలవోకగా క్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునగగా.. బౌలర్ లీచ్ అయోమయానికి గురయ్యాడు. బ్యాట్స్‌మన్ కూడా షాక్‌తో పెవిలియన్ బాట పట్టాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.