టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా యువ ఆటగాళ్ల గురించి విచిత్రమైన తర్కం వినిపించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లను పోస్ట్ పెయిడ్, సంజు శాంసన్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి కుర్రాళ్లను ప్రీ పెయిడ్ సిమ్ కార్డులతో పోల్చాడు. ఎందుకంటారా? మీరే చదవండి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రిషభ్ పంత్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రియాన్ పరాగ్ వంటి యువకులు రాణిస్తున్నారు. తమ జట్లు విజయం సాధించేందుకు అవసరమైన పరుగులు చేస్తున్నారు. విధ్వంసకరంగా ఆడుతున్నారు. వీరు టీమ్‌ఇండియాలో స్థిరపడాలంటే సమయం పడుతుందని ఓజా అంటున్నాడు. నిలకడగా రాణిస్తేనే అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:స్వర్ణంతో మెరిసిన సరిత.. మరో ఇద్దరికి కాంస్యాలు
"మీరు సంజు శాంసన్ గురించి మాట్లాడితే ఒక విషయం గమనించాలి. తొలిసారి అతడు ఎంపికైనప్పుడు జట్టులో రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ లేరు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టు గురించి మాట్లాడాలంటే నేను మీకో ఆసక్తికరమైన కథ చెబుతాను. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డుల్లాంటివారు. బిల్లులు కట్టకపోయినా మరికొన్ని రోజులు వాడుకొనే సౌలభ్యం ఉంటుంది" అని ఓజా అన్నాడు.
"కుర్రాళ్లు మాత్రం ప్రీ పెయిడ్ సిమ్ కార్డులు. గడువులోపే వాడుకోవాలి. లేదంటే సిమ్ పని చేయకుండా పోతుంది. వారు పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులు కాదని కుర్రాళ్లు తెలుసుకోవాలి. వాళ్లు పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులు కావాలంటే నిలకడైన ప్రదర్శన చేయాలి" అని ప్రజ్ఞాన్ తెలిపాడు.
ఇదీ చదవండి:'ధోనీ.. ఏడో స్థానంలో వచ్చి ఏం సాధించలేవ్'