- నాన్న లేడు.. కఠిక పేదరికం.. కడుపు నిండా తిండి తినలేని దైన్యం.. పిల్లల ఆకలి తీర్చడం కోసం అమ్మ కష్టం.. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లాడు క్రికెట్ బ్యాట్ పట్టాడు. ఆటలో సత్తాచాటి తమ పేదరికాన్ని దూరం చేస్తానని తల్లికి మాటిచ్చాడు. అందుకోసం శ్రమించాడు. చివరకు అనుకున్నది సాధించాడు. అతనే రోమన్ పావెల్!
- 15 ఏళ్ల ఆ పిల్లాడికి క్రికెట్ అంటే పిచ్చి. నాన్నకు ఆర్థికంగా భారం అవకూడదని.. శిక్షణ కోసం ఒక్క రూపాయి కూడా అడగనని కుటుంబానికి చెప్పాడు. రాత్రి పూట పని చేస్తూ.. ఉదయం శిక్షణ పొందాడు. డబ్బుల్లేక ఏడాది పాటు మధ్యాహ్న భోజనం చేయలేదు. రూ.10 ఆదా చేసేందుకు కొన్ని మైళ్ల దూరం కాలినడకన వెళ్లేవాడు. ఇప్పుడు తన కలను నిజం చేసుకుంటూ టీ20 లీగ్‌తో అరంగేట్రం చేశాడు. తన స్పిన్‌తో ఆకట్టుకుంటున్నాడు. అతనే కుమార్ కార్తీకేయ సింగ్!
వీళ్లిద్దరి కథలు వేరే.. దేశాలు వేరు.. కానీ కల మాత్రం ఒక్కటే. పేదరికాన్ని దాటి.. ఇబ్బందులను అధిగమించి తమ స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
అమ్మ కోసం:హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే అజేయంగా 67 పరుగులు చేసిన దిల్లీ ఆటగాడు పావెల్ అదరగొట్టాడు. అలవోకగా భారీ షాట్లు ఆడగలడనే పేరును నిజం చేస్తూ ఈ విండీస్ వీరుడు చెలరేగాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌ల్లో ఒకటైన టీ20 లీగ్‌లో తన సత్తా చాటుతున్నాడు. కానీ అతను ఈ స్థాయికి చేరడం వెనక ఓ కన్నీటి గాథ ఉంది. ఓ నిశ్శబ్ద యుద్ధం ఉంది. ఓ తల్లి త్యాగం ఉంది. పావెల్ పిండంగా ఉండగానే కడుపు తీయించుకోవాలని ఆ తల్లిని ఆమె భర్త బలవంతం చేశాడు. కానీ కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆమె భర్తనే దూరం చేసుకుంది. ఒక్కో నెల కష్టంగా గడుపుతూ బిడ్డకు జన్మనిచ్చింది. అతణ్ని పెంచడం కోసం ఇతరుల ఇళ్లలో పని చేసేది. అమ్మకు సాయంగా ఉండేందుకు అతను మేకల కాపరిగానూ మారాడు. ఒక్కో పూట తినడానికి కూడా తిండి ఉండేది కాదు. రెండు గదుల చిన్న ఇంట్లో అష్టకష్టాలు పడుతూ జీవితం సాగించాడు. వర్షం పడితే ఇక రాత్రి జాగరణే. పైకప్పు నుంచి నీళ్లు వచ్చేవి. అలాంటి దుర్భర పరిస్థితులు చూసిన పావెల్.. ఒక రోజు క్రికెట్ బ్యాట్‌తో ఇంటికి తిరిగొచ్చాడు. ఆటతో పేదరికాన్ని దూరం చేస్తానని తల్లికి మాటిచ్చాడు. తన అమ్మ, సోదరికి మెరుగైన జీవితాన్ని ఇవ్వడం కోసం తీవ్రంగా శ్రమించాడు. సవాళ్లు ఎదురైనా కుంగిపోలేదు. తన తల్లి, సోదరిని గుర్తు తెచ్చుకుంటూ మరింత కష్టపడ్డాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. కరీబియన్ ప్రిమియర్ లీగ్‌లో సంచలన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. తన తల్లి కోసం కొత్త ఇల్లు కొనిచ్చాడు. దిగ్గజ ఆటగాళ్ల ప్రస్తావన వచ్చినప్పుడు తన పేరు కూడా ఉండాలనేది తన లక్ష్యమంటున్నాడు.