Kohli Rahul Rohit T20 Career : టీ20 క్రికెట్ ఫార్మాట్ వేగంగా మారుతోంది. మెరుపు షాట్లు, అద్భుతమైన బౌండరీలతో సూపర్ యాక్షన్‌తో ఆటగాళ్లు ఆకట్టుకుంటున్నారు. టీ20 ఫార్మాట్లో ప్లేయర్ సామర్థ్యం కొలిచేవి బౌండరీల శాతం, స్ట్రైక్ రేట్ గణాంకాలే. అలాంటి ప్లేయర్లను ఐపీఎల్ సమృద్ధిగా అందిస్తోంది. టీమ్ఇండియాలో ఎంపిక చేయడానికి బీసీసీఐ సెలక్టర్లకు మంచి ఆప్షన్లు ఇస్తోంది. దీంతో ఈ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ స్టార్ ప్లేయర్ల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది.
ఈ క్రమంలో రానున్న 90 రోజుల్లో ఈ ప్లేయర్లపై వేటు పడుతుందని టైమ్‌లైన్ ఇచ్చాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. 'టీ20 క్రికెట్లో అగ్రెసివ్ బ్రాండ్‌గా ఉంటామని గతంలో ఇచ్చిన హామీకి బీసీసీఐ కట్టుబడి ఉంటే.. రోహిత్, రాహుల్, కోహ్లీకి ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, మొదట వేటు పడేది కోహ్లీ, రోహిత్ పైనే. తర్వాతి తరం ఆటగాళ్లు సిద్ధమవుతున్నారని నేను భావిస్తున్నాను. అలా కొత్త వాళ్లు వస్తే.. ముందు తరం క్రికెటర్లకు ఇబ్బంది ఎదురవుతుంది. ఇది వన్డే వరల్డ్ కప్ జరిగే ఏడాది. అయినా కూడా కొన్ని టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే, జరిగే ఆ కొద్ది మ్యాచ్‌ల్లో కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడరనేది నా అభిప్రాయం. ఇక, కేఎల్ రాహుల్ అప్పటికివరకు అందుబాటులో ఉంటాడనేది అనుమానమే. అందుకే రానున్న 90 రోజుల్లో పరిస్థితులు అనూహ్యంగా మారుతాయి' అని చెప్పుకొచ్చాడు ఆకాశ్ చోప్రా.
ఇదే విషయంపై టీమ్ఇండియా మాజీ దిగ్గజం రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్‌లను టీ20 నుంచి తప్పించి.. యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని ఇటీవల బీసీసీఐకి సూచించాడు. సీనియర్ ప్లేయర్లను వన్డే, టెస్టులకు పరిమితం చేయాలని చెప్పాడు. 'ఈ ఐపీఎల్ సీజన్లో రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ లాంటి యంగ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. దీంతో సెలక్టర్లకు మంచి ఆప్షన్లు లభిస్తున్నాయి. కోహ్లీ, విరాట్ లాంటి ప్లేయర్లు నిరూపించుకున్నాడు. వారి గురంచి అందరికీ తెలుసు. కానీ, ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసిన వారికి అవకాశాలు రావాలి' అని చెప్పుకొచ్చారు.
రవి శాస్త్రి, ఆకాశ్ చోప్రా చెప్పిన దాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో విరాట్, రోహిత్ గ్యాప్ లేకుండా ఆడుతున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లలో చికాకు పెరుగుతోందని కాబట్టి.. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్పై కూడా శ్రద్ధ పెట్టాలి. విరాట్ వయసు ప్రస్తుతం 34. రోహిత్ ఏజ్ 36. ఈ కారణంగా కూడా మూడు ఫార్మాట్లలో వీరు రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడటం కష్టమే. అయితే వీరిద్దరిని టీ20ల నుంచి తప్పిస్తే.. వన్డే, టెస్టుల్లో ఆడుతారు. తద్వారా మరికొన్ని రోజులు జట్టులో ఉండే అవకాశం ఉంది. నిజానికి టీమ్ఇండియా సెలక్టర్లు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే హార్దిక్ పాండ్యకు టీ20 పగ్గాలు అప్పగించారు. టీ20 కొత్త ప్లేయర్లు వస్తే.. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా టైటిల్ గెలిచే అవకాశం ఉంటుంది.