తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 Qualifier 2 : గిల్ మూడో శతకం.. ముంబయి చిత్తు.. రెండోసారి ఫైనల్​కు గుజరాత్

IPL 2023 Qualifier 2 : ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం వర్షం ఆగింది. కానీ ఆ తర్వాత పెను తుపానే మొదలైంది. అది మామూలు తుపాను కాదు.. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిచేలా గిల్‌ సృష్టించిన బీభత్సం. బంతిపై ఏదో కోపం ఉన్నట్లు.. స్టాండ్స్‌లోని ప్రేక్షకులే లక్ష్యం అన్నట్లు.. శుభ్‌మన్‌ వీర విధ్వంసాన్ని సాగించాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా నాలుగు మ్యాచ్‌ల్లో మూడో శతకాన్ని అందుకున్నాడు. 2016లో తిరుగులేని ఆధిపత్యంతో కోహ్లి ఏకంగా 973 పరుగులు కొట్టగా.. ఇప్పుడు గిల్‌ కూడా 851 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. మోహిత్‌తో సహా బౌలర్లు అదరగొట్టడం వల్ల ముంబయిని చిత్తుచేసిన గుజరాత్‌.. ఐపీఎల్‌-16 ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం చెన్నైతో అమీతుమీకి సిద్ధమైంది.

Gujarat Titans vs Mumbai Indians
Gujarat Titans vs Mumbai Indians

By

Published : May 26, 2023, 11:01 PM IST

Updated : May 27, 2023, 7:08 AM IST

IPL 2023 Qualifier 2 : ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ సమరంలో భాగంగా జరిగిన ముంబయి ఇండియన్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌దే పైచేయి. శుక్రవారం రెండో క్వాలిఫయర్స్‌లో ఆ జట్టు 62 పరుగుల తేడాతో ముంబయిపై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుభ్‌మన్‌ గిల్‌ విధ్వంసక శతకంతో మొదట గుజరాత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న సాయి సుదర్శన్‌.. గిల్‌కు చక్కటి సహకారం అందించాడు. ఛేదనలో ముంబయి 18.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ పోరాటం సరిపోలేదు. మోహిత్‌ శర్మ ఆ జట్టును దెబ్బకొట్టాడు. అంతకుముందు వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా మ్యాచ్‌ మొదలైంది.

ఆశలు రేపినా..
కొండంత లక్ష్య ఛేదనలో ముంబయికి ఆశించిన ఆరంభం దక్కలేదు. కానీ తిలక్‌, గ్రీన్‌, సూర్య ఆశలు రేపినప్పటికీ.. జట్టును గెలిపించలేకపోయారు. ఇషాన్‌ ఆడలేకపోవడం వల్ల ఆకాశ్‌ స్థానంలో 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌'గా వచ్చిన నేహాల్​తో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న షమి.. తన వరుస ఓవర్లలో ఓపెనర్లను ఔట్‌ చేసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. మధ్యలో మోచేతి గాయం వల్ల గ్రీన్‌ బయటకు వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు ముంబయి పరిస్థితి అగమ్యగోచరంగా కనిపించింది. కానీ వస్తూనే బౌలర్లపై తిలక్‌ ఎదురుదాడికి దిగాడు. ఉన్నంతసేపు ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. షమి ఓవర్లో అతను వరుసగా నాలుగు ఫోర్లతో పాటు ఓ సిక్సర్‌ కూడా కొట్టడం విశేషం. బంతిని గట్టిగా బాదాలనే కసితో తిలక్‌ కనిపించాడు. ప్రమాదకర రషీద్‌ బౌలింగ్‌లోనూ ఓ బౌండరీ సాధించాడు. కానీ అదే ఓవర్లో స్లాగ్‌ స్వీప్‌కు ప్రయత్నించి బౌల్డవడం వల్ల ముంబయి 6 ఓవర్లకు 72/3తో నిలిచింది.

మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన గ్రీన్‌తో కలిసి సూర్య జట్టును లక్ష్యం దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ చకచకా బౌండరీలు బాదేస్తూ జట్టును నడిపించారు. 11 ఓవర్లకు 123/3తో ముంబయి అప్పటికీ రేసులోనే ఉంది. కానీ గిల్‌ స్థానంలో 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌'గా మైదానంలోకి దిగిన లిటిల్‌..తన తొలి ఓవర్లోనే గ్రీన్‌ను బౌల్డ్‌ చేసి ఇంపాక్ట్‌ చూపించాడు. మరోవైపు 360 డిగ్రీల ఆటతో సూర్య పోరాటం కొనసాగించాడు.

లిటిల్‌ బౌలింగ్‌లో స్కూప్‌తో అదిరే సిక్సర్‌తో అర్ధశతకానికి చేరుకున్నాడు. 14.2 ఓవర్లకు స్కోరు 155/4. కానీ ఆ తర్వాత మోహిత్‌ మాయ మొదలైంది. బంతి అందుకున్న మోహిత్‌.. మొదట సూర్యను బౌల్డ్‌ చేయడం వల్ల ముంబయి ఆశలకు తెరపడింది. ఆఫ్‌సైడ్‌ జరిగి షాట్‌ ఆడేందుకు సూర్య ప్రయత్నించగా.. బంతి లెగ్‌స్టంప్‌ను ముద్దాడింది. తర్వాతి ఓవర్లోనే డేవిడ్​ను..రషీద్‌ పెవిలియన్‌ చేర్చడం వల్ల ఇక ముంబయి పనైపోయింది. చివరి ఆరు వికెట్లలో మోహిత్‌ అయిదు సొంతం చేసుకోవడం విశేషం. 16 పరుగుల వ్యవధిలోనే ముంబయి చివరి ఆరు వికెట్లను కోల్పోయింది.

బాదుడే బాదుడు..
టాస్‌ గెలిచిన ముంబయి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ను అంతా తానై నడిపించాడు యువ ప్లేయర్​ శుభ్​మన్​ గిల్​. వర్షం ప్రభావం పెద్దగా కనిపించని పిచ్‌పై సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి రెచ్చిపోయాడు. ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం అతనికి ఓ మేర కలిసొచ్చింది. పవర్‌ప్లేను టైటాన్స్‌ 50/0తో ముగించింది.

కానీ ఆ వెంటనే బంతి అందుకున్న చావ్లా.. సాహాను బుట్టలో వేసుకున్నాడు. కానీ సుదర్శన్‌ జతగా గిల్‌ చెలరేగడం వల్ల టైటాన్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అర్ధశతకం తర్వాత గిల్‌ విధ్వంసం తారస్థాయికి చేరింది. అతను సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. గత మ్యాచ్‌లో అయిదు వికెట్లతో జోరు మీదున్న ఆకాశ్‌ (1/52) బౌలింగ్‌లో ఎదురు దాడికి దిగిన గిల్‌.. ఒకే ఓవర్లో మూడు కళ్లుచెదిరే సిక్సర్లను కొట్టాడు.

చావ్లా ఓవర్లోనూ రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో అదే శిక్ష వేశాడు. అందులో ఒక బంతిని క్రీజు వదిలి ముందుకు వచ్చి వైడ్‌ లాంగాన్‌ మీదుగా 106 మీటర్ల దూరానికి పంపించాడు. అదే ఊపులో కేవలం 49 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. మొదట 32 బంతుల్లో 50 పరుగులు చేసిన గిల్‌.. మరో 17 బంతుల్లోనే సెంచరీని చేరుకోవడం అతని ఊచకోతకు నిదర్శనం. ఆ తర్వాతా అతని వీర బాదుడు కొనసాగింది. బౌలర్లందరూ అతని బాధితులే. సుదర్శన్‌ కూడా గేరు మార్చడంతో 16 ఓవర్లకే జట్టు స్కోరు 183/1.

ఆ తర్వాతి ఓవర్లోనే గిల్‌ వీరోచిత ఇన్నింగ్స్‌కు ఆకాశ్‌ ముగింపు పలికాడు. దీంతో 138 పరుగులకే రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అందులో శుభ్‌మన్‌వే 95 (38 బంతుల్లో) పరుగులు కావడం విశేషం. ఇక వస్తూనే హార్దిక్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. కానీ సుదర్శన్‌ బౌండరీలు సాధించడంలో విఫలమవడం వల్ల 18, 19 ఓవర్లు కలిపి 16 పరుగులే వచ్చాయి. వేగంగా ఆడడం వల్ల ఇబ్బంది పడ్డ సుదర్శన్‌.. రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరగడం గమనార్హం. ఇన్నింగ్స్‌ చివరి రెండు బంతులకు 4, 6 కొట్టిన హార్దిక్‌ జట్టు స్కోరును 230 దాటించాడు.

Last Updated : May 27, 2023, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details