ముంబయి నిలిచింది. టిమ్ డేవిడ్ (45 నాటౌట్; 14 బంతుల్లో 2×4, 5×6) సంచలన బ్యాటింగ్‌తో ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ (124; 62 బంతుల్లో 16×4, 8×6) మెరుపు శతకంతో మొదట రాజస్థాన్ 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. డేవిడ్‌తో పాటు సూర్యకుమార్ (55; 29 బంతుల్లో 8×4, 2×6), గ్రీన్ (44; 26 బంతుల్లో 4×4, 2×6), తిలక్ వర్మ (29 నాటౌట్) మెరవడంతో లక్ష్యాన్ని ముంబయి 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్‌లో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం.
డేవిడ్ ధనాధన్..
భారీ ఛేదనలో రోహిత్ (3) విఫలమైనా, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (28) బ్యాట్ ఝుళిపించలేకపోయినా.. గ్రీన్, సూర్య మెరుపులతో ముంబయి 10 ఓవర్లలో 98/2తో నిలిచింది. ఆ తర్వాత గ్రీన్ నిష్క్రమించినా సూర్య జోరు కొనసాగించాడు. అతడికి తిలక్ వర్మ అండగా ఉండడంతో ముంబయి 14 ఓవర్లలో 141/3తో రేసులో నిలిచింది. చివరి 6 ఓవర్లలో 72 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ 16వ ఓవర్లో సూర్య ఔట్ కావడంతో ముంబయి ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. రాజస్థాన్ పైచేయి సాధించినట్లే అనిపించింది. కానీ టిమ్ డేవిడ్, తిలక్ పోరాడారు. ధాటిగా ఆడారు. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా డేవిడ్ చెలరేగిపోయాడు. హోల్డర్ వేసిన తొలి మూడు బంతుల్లో సిక్స్‌లు బాది ముంబయికి విజయాన్నందించాడు. డేవిడ్, తిలక్ అభేద్యమైన అయిదో వికెట్‌కు 23 బంతుల్లోనే 62 పరుగులు జోడించారు. హోల్డర్ 3.3 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు.
శతక్కొట్టిన యశస్వి:
రాజస్థాన్ ఇన్నింగ్స్ యశస్వి జైస్వాల్ ఆటే హైలైట్. మెరిసింది అతడొక్కడే. మరోవైపు నుంచి పెద్దగా సహకారం లేకపోయినా.. అతడు ఒంటి చేత్తో జట్టుకు భారీ స్కోరును అందించాడు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ తర్వాత అత్యధిక స్కోరు ఎక్స్‌ట్రాల (25)దే కావడం విశేషం. ఇక బ్యాటర్లలో 18 పరుగుల చేసిన బట్లరే రెండో టాప్ స్కోరర్ అంటే.. జైస్వాల్ ఇన్నింగ్స్ ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన జైస్వాల్ ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మెరిడిత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు బాదేశాడు.