ఐపీఎల్ 2023 సీజన్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బౌలర్ మోసిన్ ఖాన్.. ఒక్క ఓవర్‌తో హీరోగా మారిపోయాడు. తాజాగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోసిన్.. చివరి ఓవర్లో 11 పరుగుల లక్ష్యాన్ని కాపాడి జట్టుకు విజయాన్ని అందించాడు. గాయం కారణంగా ఏడాది తర్వాత ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన అతడు.. తన అద్భుత ప్రదర్శనతో సంచలనంగా మారాడు. ఈ సీజన్లో తన రెండో మ్యాచ్ ఆడుతున్న ఈ 24 ఏళ్ల ఈ యూపీ బౌలర్.. చివరి ఓవర్ ఒత్తిడిని అధిగమిస్తూ వేసిన బౌలింగ్ ప్రస్తుతం సెన్సేషనల్‌గా మారింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పది రోజులుగా తన తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, అయినా ఆ బాధను దిగమింగుతూ చివరి ఓవర్‌ను విజయవంతంగా వేశానని మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యాడు మోసిన్.
"ఇది నాకు కష్టకాలం. గాయం కారణంగా ఏడాది తర్వాత క్రికెట్ ఆడుతున్నాను. మా నాన్న పది రోజుల పాటు ఐసీయూలో ఉండి నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. నేను ఆయన కోసమే ఈ విజయం సాధించాను. ఆయన నన్ను చూస్తున్నారని అనుకుంటున్నాను." అని మోసిన్ భావోద్వేగం చెందాడు. తనకు మద్దతుగా నిలిచిన జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు. "జట్టు, సహాయక సిబ్బందికి రుణపడి ఉంటాను. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ సర్, విజయ్ దహియా సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.నేను గత మ్యాచ్‌లో సరిగా ఆడకపోయినా ఈ మ్యాచులో ఆడించారు" అని పేర్కొన్నాడు.