IPL 2023 Final CSK VS GT : అభిమానుల కేరింతలు, ఈలలు, సంబరాలు మధ్య జరగాల్సిన ఐపీఎల్‌ను.. కరోనా వల్ల గత మూడేళ్ల పాటు సింపుల్‌గా నిర్వహించేశారు. స్టేడియాల్లో ప్రేక్షకులను అనుమతించలేదు. గతేడాది పరిమిత స్థాయిలో మాత్రమే అనుమతించారు. ఆ సమయంలో ప్లేయర్స్‌తో పాటు ఆడియెన్స్ కాస్త నిరాశగానే ఉన్నారు. కానీ ఈ సారి మాత్రం అలా కాదు. ప్రారంభోత్సవ వేడుకలు, ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో అనుమతి.. ఎటువంటి ఆంక్షలు లేకుండా నిర్వహించారు. అలానే అభిమానుల కేరింతలు, ఈలలు మధ్య సీజన్ మొత్తం సాగింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక మంది వీక్షించిన సీజన్‌గానూ ఈ సీజన్ నిలిచింది. అన్ని మ్యాచ్‌లు కూడా ఉత్కంఠగా సాగాయి. ముఖ్యంగా ధోనీ కోసం అభిమానులు బారులు తీరారు.
అలా దాదాపు రెండు నెలల పాటు అభిమానులను ఊర్రూతలూగిస్తూ సాఫీగా సాగిన టోర్నీలో.. అసలు సిసలైన ఫైనల్ పోరు కోసం మరింత ఉత్కంఠగా ఎదురుచూశారు అభిమానులు. ఆదివారం(మే 28న) తుదిపోరులో.. సీఎస్కే ఐదోసారి ట్రోఫీని ముద్దాడుతుందా.. లేదంటే గుజరాత్ వరుసగా రెండోసారి కప్‌ను కొడుతుందా అని ఆసక్తితో ఉన్నారు. కానీ అభిమానుల ఆశలపై వరుణ దేవుడు నీళ్లు చల్లాడు.
మ్యాచ్ వాయిదా...
IPL 2023 Final CSK VS GT Rain: అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌కు అడ్డంకిగా నిలిచాడు. ఈ తుది పోరును వీక్షించాలని మధ్యాహ్నం నుంచే స్టేడియం వద్ద బారులు తీరిన ప్రేక్షకులకు, టీవీలకు అతుక్కుపోయిన ఆడియెన్స్‌ను నిరాశపరిచాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాడు. ఈ వర్షం వల్ల టాస్ కూడా ఆలస్యం అయింది. మ్యాచ్ సమయానికి మూడు గంటలు దాటినా.. వర్షం జోరు మాత్రం తగ్గడం లేదు. దీంతో అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్‌ను మే 29కు(సోమవారం) వాయిదా వేశారు.