IPL 2022 CSK VS PBKS:ఐపీఎల్-2022లో వరుసగా మూడు మ్యాచ్‌లు కోల్పోయి పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతున్న చెన్నై టీమ్ మళ్లీ గాడిలో పడాలంటే కొత్త దారి కనుక్కోవాలని ఆ జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజా అన్నాడు. ఆదివారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన జడ్డూ తమ జట్టు ఓటమికి గల కారణాలపై స్పందించాడు.
" మేం పవర్ ప్లేలో చాలా వికెట్లు కోల్పోయాం. తొలి బంతి నుంచే వెనుకబడిపోయాం. మేం బలంగా పుంజుకొని రావడానికి కొత్త దారి కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి భరోసా ఇవ్వాలి. అతడికి అండగా ఉండాలి. అతడెంత మంచి ఆటగాడో మా అందరికీ తెలుసు. కచ్చితంగా అతడి విషయంలో అండగా ఉంటాం. రాబోయే మ్యాచ్‌ల్లో అతడు రాణిస్తాడనే నమ్మకం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబె అద్భుతంగా ఆడుతున్నాడు. అతడిని ఇలాగే సానుకూల దృక్పథంతో ఉంచగలిగితే మా జట్టుకు కలిసివస్తుంది. ఇకపై శక్తి మేరకు ప్రయత్నించి తిరిగి బలం పుంజుకుంటాం"
- రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.