తమ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మరింత మెరుగవ్వాలని పరోక్షంగా సూచించాడు ముంబయి ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్. చివరి బంతి వరకు పోరాడటం తమ జట్టు బలమని అన్నాడు. ఆ పని ఇప్పటికే బౌలర్లు చేస్తున్నారని.. ఈ సీజన్లో వారి ప్రదర్శనే ఇందుకు నిదర్శమని చెప్పాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు ముంబయి నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. రెండింటింలో గెలిచింది. అయితే ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ మిడిలార్డర్ విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు బౌల్ట్.
"ఇప్పటివరకు మ్యాచ్‌లు సాగిన తీరుపై మిడిలార్డర్ సంతృప్తిగా లేదని నేను చెప్పగలను. పరుగులు చేసేందుకు వారు పట్టుదలతో ఉన్నారు. చెన్నైలో జరిగే చివరి మ్యాచ్(పంజాబ్‌పై)లో మంచి ప్రదర్శన చేయాలని అనుకుంటున్నారు. మేము మరిన్ని పరుగులు చేయాలి. చివరి బంతి వరకు పోరాడటం మా బలం. ఆ పని ఇప్పటికే బౌలర్లు చేస్తున్నారు. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో వారు అధిక పరుగులు చేస్తారని ఆశిస్తున్నా. అప్పుడే మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. తేమ పరిస్థితులు ఉన్నప్పుడు బౌలింగ్ వేయడం కష్టంగా ఉంటుంది. కానీ దాన్ని సవాలుగా స్వీకరించి ఆ పరిస్థితులను అలవాటు చేసుకుంటున్నాం." అని బౌల్ట్ అన్నాడు.
ముంబయి తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 23 చెన్నై చిదంబరం స్డేడియంలో పంజాబ్‌తో ఆడనుంది. దాని గురించి బౌల్ట్ మాట్లాడుతూ.. "పంజాబ్ బ్యాట్స్‌మన్ ప్రమదకరమైన వారు. నేను సారథి కేఎల్ రాహుల్‌కు చాలా సార్లు బౌలింగ్ వేశాను. అతడు ప్రపంచంలో ఉన్న క్లాస్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌ను ఎదుర్కోవడం సవాల్ లాంటిది" అని చెప్పాడు.