తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: ప్లేఆఫ్స్​ రేసు నుంచి రాజస్థాన్​ తప్పుకున్నట్లేనా?

ఐపీఎల్​లో(IPL 2021) ప్లేఆఫ్స్​ ఆశలతో కొనసాగుతోన్న రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు నిరాశే మిగిలింది. టోర్నీ కీలక దశలో ఆ టీమ్​కు గట్టి దెబ్బ తగిలింది. ముందంజ వేయడం మరింత కష్టంగా మారింది. ఐపీఎల్​లో సోమవారం జరిగిన మ్యాచ్​లో(RR Vs SRH) ఎనిమిది పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు(IPL Playoffs 2021) నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్‌ అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ రాజస్థాన్‌ను ఓడించింది. పది మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు ఇది ఆరో పరాజయం.

IPL 2021, SRH Vs RR Highlights: Sunrisers Hyderabad Spoils Rajasthan Royals' Playoff Chances?
IPL 2021: ప్లేఆఫ్స్​ రేసు నుంచి రాజస్థాన్​ తప్పుకున్నట్లేనా?

By

Published : Sep 28, 2021, 6:51 AM IST

ఐపీఎల్​ రెండోదశలో(IPL 2021) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు పరాజయపరంపర నుంచి బయటపడింది. ఐపీఎల్‌-14లో అయిదు ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. జేసన్‌ రాయ్‌(60) హాఫ్​సెంచరీతో చెలరేగడం వల్ల సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై(RR Vs SRH) విజయం సాధించింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌(82 నాటౌట్‌) అద్భుతమైన బ్యాటింగ్​తో మొదట రాజస్థాన్‌ 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సిద్ధార్థ్‌ కౌల్‌ (2/36), భువనేశ్వర్‌ (1/28), రషీద్‌ ఖాన్‌ (1/31) ఆ జట్టును కట్టడి చేశారు. జేసన్‌ రాయ్‌తో పాటు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(51 నాటౌట్‌) రాణించడం వల్ల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ ఓవర్లలో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఇది రెండో విజయం మాత్రమే.

జేసన్‌ దూకుడు

ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ అదిరే ఆరంభాన్నిచ్చాడు. ఎడా పెడా బౌండరీలు బాదిన అతడు.. మరో ఓపెనర్‌ సాహా(18)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయిదు ఓవర్లకే స్కోరు 57/0. తర్వాతి ఓవర్లోనే సాహా నిష్క్రమించినా, స్కోరు వేగం తగ్గినా సన్‌రైజర్స్‌ సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. రాయ్‌, విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 10 ఓవర్లకు స్కోరు 90/1. ఆ తర్వాత జేసన్‌ రాయ్‌ రెచ్చిపోయాడు. తెవాతియా బౌలింగ్‌లో స్వీప్‌ షాట్లతో అదరగొట్టాడు.

మొదట స్లాగ్‌ స్వీప్‌తో స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ బాదిన రాయ్‌.. స్వీప్‌ షాట్లతోనే మరో రెండు ఫోర్లు కొట్టాడు. రివర్స్‌ స్వీప్‌తో మరో బౌండరీ సాధించాడు. అయితే రాయ్‌ని, ఆ వెంటనే ప్రియమ్‌ గార్గ్‌ (0)ను ఔట్‌ చేయడం ద్వారా రాజస్థాన్‌ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా.. విలియమ్సన్‌ ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. చక్కని షాట్లతో అలరించిన అతడు.. అభిషేక్‌ వర్మ (21 నాటౌట్)తో కలిసి జట్టును విజయపథంలో నడిపించాడు. అభిషేక్‌తో అభేద్యమైన నాలుగో వికెట్‌కు విలియమ్సన్‌ 48 పరుగులు జోడించాడు.

రాజస్థాన్‌ కట్టడి

రాజస్థాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది కానీ.. దూకుడుగా ఆడలేకపోయింది. ఓపెనర్‌ లూయిస్‌(6)ను ఔట్‌ చేయడం ద్వారా రెండో ఓవర్లోనే రాజస్థాన్‌కు భువనేశ్వర్‌ షాకిచ్చాడు. అయితే జైస్వాల్‌, సంజు శాంసన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. జైస్వాల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. వీలైనప్పుడల్లా బౌండరీ రాబట్టాడు. అయితే రాజస్థాన్‌ స్కోరు బోర్డు మరీ వేగంగా ఏమీ కదల్లేదు. శాంసన్‌ మరీ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. 8 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 60/1 కాగా.. సంజు 23 బంతుల్లో 24 పరుగులే చేశాడు. తొమ్మిదో ఓవర్లో జైస్వాల్‌ ఔటయ్యాక స్కోరు వేగం ఇంకా తగ్గింది.

10 నుంచి 13 ఓవర్ల మధ్య రాజస్థాన్‌కు 24 పరుగులే వచ్చాయి. లివింగ్‌స్టోన్‌(4) త్వరగా నిష్క్రమించాడు. లొమ్రార్‌ కూడా ధాటిగా ఆడలేకపోయాడు. కానీ 14వ ఓవర్లో లొమ్రార్‌(29 నాటౌట్‌), ఆ తర్వాతి ఓవర్లో శాంసన్‌ ఓ సిక్స్‌ బాదడం వల్ల స్కోరు బోర్డుకు ఊపొచ్చింది. గేర్‌ మార్చిన శాంసన్‌ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. కౌల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో ఓ ఫోర్‌, రెండు సిక్స్‌లు బాదేశాడు. 17 ఓవర్లలో 143/3తో రాజస్థాన్‌ మంచి స్కోరే చేసేలా కనిపించింది. కానీ హోల్డర్‌, భువి, కౌల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల చివరి మూడు ఓవర్లలో శాంసన్‌, పరాగ్‌ వికెట్లను కోల్పోయిన రాజస్థాన్‌ 21 పరుగులే చేయగలిగింది.

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌:లూయిస్‌ (సి) సమద్‌ (బి) భువనేశ్వర్‌ 6; యశస్వి జైస్వాల్‌ (బి) సందీప్‌ 36; సంజు శాంసన్‌ (సి) హోల్డర్‌ (బి) కౌల్‌ 82; లివింగ్‌స్టోన్‌ (సి) సమద్‌ (బి) రషీద్‌ 4; లొమ్రార్‌ నాటౌట్‌ 29; పరాగ్‌ (సి) రాయ్‌ (బి) కౌల్‌ 0; తెవాతియా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164; వికెట్ల పతనం:1-11, 2-67, 3-77, 4-161, 5-162; బౌలింగ్‌:సందీప్‌ శర్మ 3-0-30-1; భువనేశ్వర్‌ 4-1-28-1; హోల్డర్‌ 4-0-27-0; సిద్ధార్థ్‌ కౌల్‌ 4-0-36-2; రషీద్‌ ఖాన్‌ 4-0-31-1; అభిషేక్‌ శర్మ 1-0-8-0

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌:జేసన్‌ రాయ్‌ (సి) శాంసన్‌ (బి) సకారియా 60; సాహా (సి) శాంసన్‌ (బి) లొమ్రార్‌ 18; విలియమ్సన్‌ నాటౌట్‌ 51; గార్గ్‌ (సి) అండ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 0; అభిషేక్‌ శర్మ నాటౌట్‌ 21; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (18.3 ఓవర్లలో 3 వికెట్లకు) 167; వికెట్ల పతనం:1-57, 2-114, 3-119; బౌలింగ్‌:ఉనద్కత్‌ 2-0-20-0; మోరిస్‌ 3-0-27-0; ముస్తాఫిజుర్‌ 3.3-0-26-1; లొమ్రార్‌ 3-0-22-1; తెవాతియా 3-0-32-0; సకారియా 4-0-32-1.

ఇదీ చూడండి..IPL 2021: రాజస్థాన్​పై సన్​రైజర్స్​ విక్టరీ

ABOUT THE AUTHOR

...view details