ఐపీఎల్లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకు దిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక కానుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోరుకు సిద్ధమయ్యాయి. రెండు జట్లలో అన్ని విభాగాలలో బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్‌లాడిన ఇరుజట్లలో రోహిత్ సేన మూడు పరాజయాలు, మూడు విజయాలతో ఉండగా.. ధోనీ సేన ఐదు విజయాలను ఖాతాలో వేసుకుంది. ఓటమితో సీజన్‌ను ప్రారంభించిన చెన్నై.. తర్వాత గొప్పగా పుంజుకొంది. వరుస విజయాలతో మునుపటి ఛాంపియన్ చెన్నైను తలపిస్తుంది ధోనీసేన.
చెన్నైకు అడ్డుందా?
తొలి మ్యాచ్‌లో ఓటమి మినహా మిగతా మ్యాచ్‌లన్నింటిలో విజయాలు సాధించిన ధోనీసేన టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా నిలిచింది. నిలకడైన ఆటతీరుతో ఓపెనింగ్ జోడీ.. ప్రత్యర్థులకు సవాలు విసురుతుంది. డుప్లెసిస్-రుతురాజ్ జంట.. జట్టుకు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ శుభారంభాన్ని అందించింది. ఆ తర్వాత వన్‌డౌన్‌లో క్రీజులోకి వస్తున్న మొయిన్ అలీ ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఇక రైనా, జడేజా, అంబటి రాయుడు, ధోనీ.. టీమ్‌కు అవసరమైనప్పుడు బ్యాట్ ఝుళిపిస్తున్నారు.
ఇక బౌలింగ్‌లో దీపక్ చాహర్‌తో పాటు ఎంగిడి, జడేజా, మొయిన్ అలీ రాణిస్తున్నారు. వీరితో పాటు శార్దుల్ ఠాకుర్, సామ్ కరన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ధోనీ సేనకు ఎదురుండదు. గత సీజన్లో ప్లేఆఫ్‌కు చేరని చెన్నై.. ఈ దఫా మళ్లీ ఛాంపియన్ చెన్నైను గుర్తుకుతెస్తోంది. వరుస విజయాలతో టైటిల్ ఫెవరేట్‌గా మారింది.