ఐపీఎల్ 2021 రెండో దశలో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెకండ్ ఫేజ్ తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను చిత్తుచేసిన సీఎస్కే.. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కేకు శుభారంభం లభించింది. గత మ్యాచ్‌లోని ఫామ్‌ను కొనసాగిస్తూ 38 పరుగులతో ఆకట్టుకున్నాడు గైక్వాడ్. ఇతడికి మద్దతుగా నిలిచాడు డుప్లెసిస్ (31). వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అనంతరం ఇదే స్కోర్ వద్ద ఇద్దరూ పెవిలియన్ చేరారు. తర్వాత కుదురుగా ఆడుతున్న మొయిన్ అలీ (23)ని పెవిలియన్ చేర్చాడు హర్షల్ పటేల్. తర్వాత రైనా, ధోనీ లాంఛనాన్ని పూర్తి చేశారు.
శుభారంభం దక్కినా..!
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లీ, పడిక్కల్ శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ బౌండరీలు బాదడమే లక్ష్యంగా ఆడారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి దాటికి తొలి పవర్‌ప్లేలో 55 పరుగులు సాధించింది ఆర్సీబీ. ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదారు. దీంతో 11 ఓవర్లలోనే స్కోర్ 100కు చేరింది. ఈ క్రమంలోనే కోహ్లీ ఐపీఎల్లో 41వ, పడిక్కల్ 6వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. కానీ కాసేపటికే కోహ్లీ (53) బ్రావో బౌలింగ్‌లో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా తొలి వికెట్‌కు 111 పరుగుల వద్ద బ్రేక్ పడింది. సీఎస్కేపై ఆర్సీబీ ఓపెనర్లకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం గమనార్హం.
ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్ (12) శార్దుల్ ఠాకూల్ బౌలింగ్‌లో భారీ సిక్సు బాది ఊపు మీద కనిపించాడు. కానీ తర్వాత బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిగిరిగాడు. అనంతరం పడిక్కల్(70)ను కూడా బోల్తా కొట్టించాడు శార్దూల్. దీంతో స్కోర్ బోర్డ్ నెమ్మదించింది. చివర్లో ఆదుకుంటారనుకున్న మ్యాక్స్‌వెల్ (11), టిమ్ డేవిడ్ (1) కూడా విఫలమయ్యారు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులకు పరిమితమైంది.
ఇదీ చూడండి: పడిక్కల్, కోహ్లీ మెరుపులు.. చెన్నై లక్ష్యం 157