తెలంగాణ

telangana

ETV Bharat / sports

మేం ఫైనల్​కు వెళ్లడం కష్టమే: ఆర్సీబీ కెప్టెన్

IPL 2022: ఐపీఎల్​ మెగా టోర్నీ రెండు నెలలకుపైగా సాగడం అటు శారీరకంగా ఇటు మానసికంగా ఇబ్బందేనని అన్నాడు బెంగళూరు జట్టు సారథి ఫాఫ్​ డుప్లెసిస్​. లీగ్‌ స్టేజ్‌లో టాప్‌-2లో చోటు దక్కించుకోకుంటే ఫైనల్‌ చేరడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. అయితే అనూహ్యంగా ఫ్లేఆప్స్​ చేరిన బెంగళూరు శుక్రవారం రాజస్థాన్​తో క్వాలిఫయర్​-2 మ్యాచ్​లో అమీతుమీ తేల్చుకోనుంది.

డుప్లెసిస్​
డుప్లెసిస్​

By

Published : May 27, 2022, 4:14 PM IST

IPL 2022 Qualifier 2: లీగ్‌ స్టేజ్‌లో టాప్‌-2లో చోటు దక్కించుకోకుంటే ఫైనల్‌ చేరడం చాలా కష్టమని బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్​ డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఈసారి మెగా టోర్నీ రెండు నెలలకుపైగా సాగడంతో అటు శారీరకంగా ఇటు మానసికంగా ఇబ్బందేనని తెలిపాడు. అయితే, ఇంత సుదీర్ఘ టోర్నీ ఆడటం వల్ల చివరి దశకు చేరుకునేసరికి పరిస్థితులకు అలవాటు పడ్డామని చెప్పాడు. అలాగే లఖ్‌నవూతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌ తేలికపాటి జల్లుల వల్ల ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆరోజు రాత్రి తమ ఆటగాళ్లలో చాలా మందికి తగినంత నిద్రలేకపోయిందని పేర్కొన్నాడు.

RCB Captian Du Plessis: నేడు (శుక్రవారం) రాజస్థాన్‌తో బెంగళూరు.. క్వాలిఫయర్‌-2 పోటీలో తలపడుతున్న సందర్భంగా డుప్లెసిస్‌ ఓ వీడియోలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే లీగ్‌ స్టేజ్‌లో వాంఖడే వేదికగా ముంబయి, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసి సెలబ్రేట్‌ చేసుకోవడంపై స్పందిస్తూ.. "అది మేం కచ్చితంగా ఆస్వాదించాల్సిన విషయం. ఎందుకంటే ఆ రోజు మేం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే విషయం మా చేతుల్లో ఏమీ లేదు. ముంబయి గెలవడంతో మాకు అవకాశం వచ్చింది. అప్పుడు మేమంతా తీవ్ర భావోద్వేగంలో ఉన్నాం. అందుకే సెలబ్రేట్‌ చేసుకున్నాం." అని డుప్లెసిస్‌ చెప్పుకొచ్చాడు.

బెంగళూరు గెలవడానికి అవకాశాలు ఎక్కువే.. భారత టీ20 మెగాటోర్నీ 15వ సీజన్‌లో ఈసారి బెంగళూరు టీమ్‌ విజేతగా నిలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, అందుకు తగ్గ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించి ఆ జట్టు ఫైనల్లో గుజరాత్‌తో తలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన భజ్జీ బెంగళూరు జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హర్భజన్​ సింగ్​, డుప్లెసిస్​

"ఈసారి బెంగళూరు జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల బ్యాటింగ్‌ లైనప్‌, బౌలింగ్‌ లైనప్‌ చూసినా ట్రోఫీ అందించే ఆటగాళ్లు ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఈరోజు జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లోనూ పూర్తి ఆధిపత్యం చలాయిస్తుందనే నమ్మకం ఉంది. అదే జరిగితే ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి ఈసారి కచ్చితంగా ట్రోఫీ అందుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రాజస్థాన్‌ను ఓడించాలంటే ఆ జట్టు తమ శక్తి సామర్థ్యాలను నమ్ముకోవాలి. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి విజయం సాధించాలి. ఆటగాళ్లంతా సమష్టిగా రాణించాలి. ఈ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ను కూడా ఇంకో సాధారణ మ్యాచ్‌లా తీసుకొని ఆడాలి. ఒత్తిడికి గురవ్వద్దు. ప్లేఆఫ్స్‌ కోసం బెంగళూరు చాలా కష్టపడింది. అలాంటి జట్టును ఇకపై ఓడించడం కష్టం" అని హర్భజన్‌ వివరించాడు. కాగా, అనూహ్య రీతిలో ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూను ఓడించింది. శుక్రవారం రాజస్థాన్‌తో పోటీపడనుంది. ఇక్కడ కూడా విజయం సాధిస్తే ఫైనల్లో గుజరాత్‌తో తలపడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు ఏం చేస్తుందో వేచి చూడాలి.

ఇవీ చదవండి:వావ్​ పటిదార్‌.. 'బెంగళూరు' కోసం పెళ్లిని వాయిదా వేసుకున్నావా!

రాజస్థాన్​ X బెంగళూరు.. ఎవరి బలమెంత.. ఫైనల్​కు వెళ్లేదెవరు?

ABOUT THE AUTHOR

...view details