IPL Crowd Capacity: క్రికెట్ అభిమానులకు మరో కిక్కిచ్చే వార్త. స్టేడియం సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు. 'టీ20 మెగా టోర్నీలో భాగంగా.. ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించుకునేందుకు బీసీసీఐ అనుమతించింది. అందుకు సంబంధించిన టికెట్లు ఈ రోజు నుంచే అందుబాటులో ఉంటాయి. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మరింత మంది క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచును చూసే వెసులుబాటు దొరికింది' అని 'బుక్ మై షో' నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
టీ20 మెగా టోర్నీ 15వ సీజన్‌కు సంబంధించిన మ్యాచులన్నీ మహరాష్ట్రలోని వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్, ఎంసీఏ మైదానాల్లో జరుగుతున్నాయి. కరోనా కారణంగా తొలుత 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాల్లోకి అనుమతించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. తాజాగా, ఏప్రిల్ 2 నుంచి అన్ని రకాల కరోనా నిబంధనలను ఎత్తివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీలో భాగంగా శనివారం (ఏప్రిల్ 2) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబయితో తలపడనుంది రాజస్థాన్ రాయల్స్. డీవై పాటిల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఎంసీఏ వేదికగా రాత్రి 7.30 గంటలకు దిల్లీ, గుజరాత్ పోటీపడనున్నాయి.