టీ20 క్రికెట్ అంటేనే రసవత్తర పోరాటాలకు కేరాఫ్ అడ్రెస్. అలాంటిది ఇక ఐపీఎల్ అంటే ఆ మజానే వేరబ్బా. దాని గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాలా. 15 సీజన్ల నుంచి హోరాహోరీగా మ్యాచ్‌లు.. ఊహకందని మలుపులు.. కళ్లు తిప్పుకోనివ్వని ఉత్కంఠ క్షణాలు.. చివరి నిమిషం వరకూ సాగే పోరాటాలు.. నిమిషాల్లో మారే ఫలితాలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే వస్తానే ఉంటాయి. అయితే ప్రతిసారీ అభిమానులకు బోలేడు వినోదాన్ని పంచే ఈ మెగాటోర్నీ.. ఈ సారి మరింత వినోదాన్ని, కిక్కును అందించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి కొన్ని గంటల్లో ఈ క్రికెట్ సంబరానికి తేరలేవనుంది. అసలు సిసలైన సమరం మొదలుకానుంది. ఈ 16వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్- డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోరుతో గ్రాండ్‌గా ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే గతేడాది తమ తొలి సీజన్లో ఛాంపియన్‌గా అవతరించిన గుజరాత్ టైటాన్స్.. ఈ సారి లీగ్‌లోనూ విజయాన్ని కొనసాగించాలని జోష్‌తో ఉంది. అలాగే గత సీజన్లో గ్రూప్ దశలోనే వైదొలిగిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని పట్టుదలతో ఉంది. అలా ఈ ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే-హార్దిక్ కెప్టెన్సీలో గజరాత్.. రెండు జట్లు బరిలోకి దిగబోతున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు బలహీనతలపై ఓ లుక్కేద్దాం..
ధోనీ లేకుండానే.. సీఎస్కే తొలి మ్యాచ్‌కు ముందే పెద్ద షాక్ తగిలింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోనీ గాయపడ్డాడు. అతడు ఆడేది అనుమానంగా మారింది. ఓపెనర్లుగా డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌లు ఆడే అవకాశం ఉంది. మూడో స్థానంలో బెన్ స్టోక్స్ దిగొచ్చు. జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, బెన్ స్టోక్స్.. ఇలా జట్టులో నలుగురు ఆల్ రౌండర్లు ఉన్నారు. అయితే తొలి మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ బౌలింగ్ చేసేది అనుమానమే. ఇక బౌలర్లలో దీపక్ చహర్, సిమ్రన్ జీత్ సింగ్, డ్వేన్ ప్రిటోరియస్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్లో బాగా రాణించిన యువ పేసర్ ముఖేశ్ చౌదరి గాయంతో దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆకాశ్ సింగ్‌ను ఎంపిక చేశారు. బ్యాటింగ్‌లో అంబటి రాయుడుతో జట్టు బలంగా ఉంది. బ్యాటింగ్‌లో జడేజా, బెన్‌స్టోక్స్, అంబటి రాయుడుతో జట్టు బలంగా ఉంది.
ఫుల్ ఫామ్‌లో గుజరాత్.. గుజరాత్ జట్టులో శుభమన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు, సాహా ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సిన డేవిడ్ మిల్లర్.. అంతర్జాతీయ మ్యాచులు ఉన్న కారణంగా అతడు కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు. దీంతో మ్యాథ్యూ వేడ్‌కు అవకాశం దక్కొచ్చు. కేన్ విలియమ్సన్ గుజరాత్ తరఫున తెరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్య, తెవాటియాలతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్, షమీ, సాయికిషోర్, అల్జారీ జోసెఫ్‌లు కీలకంగా ఉన్నారు. ఒకవేళ అల్జారీ జోసెఫ్‌ను ఆడించకపోతే జాష్ లిటిల్ బరిలోకి దిగొచ్చు.