IPL Media rights auction: కాసుల వర్షం కురిసే ఐపీఎల్ లీగ్‌లో మరోసారి రూ.వేల కోట్లు ఖజానాలో చేరే సమయం ఆసన్నమవుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మీడియా హక్కుల కోసం నిర్వహించే ఈ- వేలం ఆదివారం ఆరంభమవుతుంది. 2023 నుంచి 2027 వరకు అంటే అయిదేళ్ల కాలానికి గాను ఈ హక్కుల కోసం సుమారు రూ.45 వేల కోట్ల ధర పలుకుతుందని బీసీసీఐ అంచనా వేస్తోంది. 2017లో స్టార్ ఇండియా 2018-2022 కోసం రూ.16,347.50 కోట్లకు (టీవీ, డిజిటల్ ప్రసారాలు) ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటికీ అదే సరికొత్త రికార్డు. ఈ సారి ఆ రికార్డు బద్దలవడం ఖాయం. ఎందుకంటే కనీస ధరనే రూ.32,440 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది. దాని కంటే కనీసం రూ.12,500 కోట్ల వరకు అధిక ధర పలుకుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మొత్తం ధర రూ.45 వేల కోట్లకు చేరుతుందనే అంచనాలున్నాయి. టీవీ, డిజిటల్ మాధ్యమాల్లో ప్రసారాల హక్కుల కోసం డిస్నీ స్టార్, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, సోనీ, జీ లాంటి దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ రేసు నుంచి అమెజాన్ శుక్రవారం తప్పుకుంది. "వేలం నుంచి అమెజాన్ తప్పుకుంది. సాంకేతిక బిడ్డింగ్ ప్రక్రియలో ఆ సంస్థ చేరలేదు. మరోవైపు యూట్యూబ్ కూడా బిడ్ దరఖాస్తు తీసుకుంది కానీ ఇప్పటికీ దాన్ని సమర్పించలేదు. దీంతో టీవీ, స్ట్రీమింగ్ పరంగా చూసుకుంటే 10 సంస్థలు హక్కుల కోసం బరిలో నిలిచాయి" అని ఓ సీనియర్ బీసీసీఐ ప్రతినిధి తెలిపాడు.
తొలిసారి ఈ- వేలం..టీ20 లీగ్ మీడియా హక్కుల కోసం తొలిసారి బీసీసీఐ ఈ- వేలం నిర్వహిస్తుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలానికి ప్రత్యేకంగా ముగింపు తేదీని ప్రకటించలేదు. కానీ సోమవారం లేదా మంగళవారం ఇది ముగిసే అవకాశం ఉంది. మిగతా సంస్థలన్నీ పక్కకు తప్పుకుని, అత్యధిక బిడ్ దాఖలయ్యే వరకూ ఈ వేలం కొనసాగుతుంది. ఆన్‌లైన్ పోర్టల్‌లో సంస్థలు తమ బిడ్లు దాఖలు చేస్తాయి. ఒక్కొక్క సంస్థ వేలం నుంచి తప్పుకుంటూ చివరకు ఒక్కటి మాత్రమే మిగిలేంత వరకూ వేలం జరుగుతుంది. సంస్థలు వేసిన బిడ్లు ఎప్పటికప్పుడూ ప్రత్యక్షంగా తెర మీద కనిపిస్తాయి. కానీ వాటి పేర్లు మాత్రం బయటపెట్టరు. చివరకు అత్యధిక బిడ్ దాఖలు చేసిన సంస్థ పేరును ప్రకటిస్తారు.