IPL 2022 Auction: క్రికెట్ ప్రియులు ఉత్సాహంగా ఎదురుచూసిన ఐపీఎల్ 2022 మెగా వేలం ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. రెండు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ వేలంలో ఊహించని విధంగా యువ క్రికెటర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ఆల్‌రౌండర్లపై కాసుల వర్షం కురవగా.. కొందరు సీనియర్లకు నిరాశే ఎదురైంది. అయితే ఈ వేలం ప్రక్రియలో ఓ తప్పిదం జరిగినట్లు తాజాగా సోషల్‌మీడియాలో బయటికొచ్చింది. ఆక్షనీర్ పొరబాటు కారణంగా ముంబయి ఇండియన్స్‌కు దక్కాల్సిన పేసర్ ఖలీల్ అహ్మద్‌ను దిల్లీ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
గత నాలుగేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్‌కు రూ. 50లక్షల బేస్ ధరతో ఆక్షనీర్ వేలం మొదలుపెట్టారు. ఈ లెఫ్ట్ ఆర్మర్ బౌలర్ కోసం ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటంతో ఖలీల్ ధర 10 రెట్లు పెరిగి రూ. 5 కోట్లకు చేరింది. సరిగ్గా అదే సమయంలో ఆక్షనీర్ గందరగోళానికి గురయ్యారు. రూ.5కోట్లకు దిల్లీ పాడగా.. ముంబయి రూ.5.25కోట్లకు పాడింది. రూల్స్ ప్రకారం.. తర్వాత దిల్లీ ఆసక్తిగా ఉంటే రూ.5.50కోట్లకు బిడ్ వేయాలి. ఆ సమయంలో దిల్లీ కాస్త తటపటాయించి బ్యాటన్‌ను సగం వరకే లేపి ఆపేసింది. అప్పటికి అత్యధిక ధర పాడింది ముంబయి ఇండియన్సే.