ఐపీఎల్‌లో పవర్ హిట్టింగ్‌తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్. గత సీజన్లోనూ కొన్ని మెరుపులు మెరిపించినా ఎప్పుడూ ఇంతలా చెలరేగలేదు. అయితే ప్రస్తుత జోరుకు కారణమేంటో వెల్లడించాడు సంజు. ఓ రోజు జిమ్‌లో కోహ్లీతో జరిపిన సంభాషణ ఆటపట్ల తన దృష్టికోణాన్నే మార్చేసిందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
"నేను భారత జట్టులో ఉన్నప్పుడు ఒక గొప్ప అనుభవం ఎదురైంది. ఓ రోజు విరాట్ భాయ్‌తో కలిసి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నా. ఫిట్‌నెస్‌పై అంత కష్టపడడానికి కారణమేంటని అతడ్ని అడిగా. అలాగే ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టా. అప్పుడు కోహ్లీ.. 'సంజు.. నువ్వు ఎంతకాలం క్రికెట్ ఆడబోతున్నావు?' అన్నాడు. 'ఇప్పుడు నా వయసు 25. మరో 10 ఏళ్లు ఆడతాను కావొచ్చు' అని చెప్పా. అప్పుడతడు.. 'అయితే ఈ పదేళ్లు క్రికెట్ కోసం సర్వస్వం ఇవ్వు. ఆ తర్వాత నువ్వు నీ ఫేవరెట్ కేరళ ఆహారం తినొచ్చు. కానీ ఈ పదేళ్ల తర్వాత మాత్రం నువ్వు క్రికెట్ ఆడలేవు. అలాంటప్పుడు ఈ పదేళ్లు నీ శక్తినంతా క్రికెట్ కోసం ఎందుకు వెచ్చించకూడదు?' అని అన్నాడు. కోహ్లీ మాటలు క్రికెట్ పట్ల నా దృక్కోణాన్ని మార్చాయి.