టీ20 క్రికెట్ అంటేనే రసవత్తర పోరాటాలకు చిరునామా. అలాంటిది ఇక ఐపీఎల్‌లో ఆ మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ కిక్కును మరింత పెంచుతూ ఈ పదమూడో సీజన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత హోరాహోరీగా సాగిన సీజన్‌గా నిలిచింది. గతంలో లీగ్ దశలో మరో పది మ్యాచ్‌లు మిగిలి ఉండగానే తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్ చేరే జట్లపై ఓ స్పష్టత వచ్చేది. కానీ ఈ సీజన్‌లో చివరి మ్యాచ్ వరకూ ఉత్కంఠ కొనసాగింది. చివరి రెండు మ్యాచ్‌లకు ముందు వరకూ కేవలం ముంబయి ఇండియన్స్ మాత్రమే ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుందంటే పోటీ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఒక్క విజయమే తేడా..
లీగ్ దశ చివరి రెండు మ్యాచ్‌ల ఫలితాల తర్వాతే దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందంజ వేశాయి. సన్‌రైజర్స్, ఆర్సీబీ, కేకేఆర్ తలో 14 పాయింట్లతో.. పంజాబ్, సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ తలో 12 పాయింట్లతో లీగ్‌ను ముగించాయి. ఆఖరి స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ (6 విజయాలు)తో పోలిస్తే లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబయి ఇండియన్స్ కేవలం మూడు విజయాలు మాత్రమే అధికంగా సాధించింది. ప్లేఆఫ్ చేరిన చివరి రెండు జట్లకు, తొలి దశలో నిష్క్రమించిన నాలుగు జట్లకు మధ్య తేడా ఒక్క విజయమే. ఈ సీజన్లో 15 పరుగులు, అంతకంటే తక్కువ తేడాతో 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలగా.. నాలుగు, అంతకంటే తక్కువ బంతులు ఉండగా మరో 9 మ్యాచ్‌ల్లో జట్లు గెలిచాయి.
సూపరో సూపర్ ఓవర్లు..
ఈ సీజన్‌లో సూపర్ ఓవర్లు అభిమానులు ఉర్రూతలూగించాయి. లీగ్ చరిత్రలో తొలిసారిగా 4 మ్యాచ్‌ల ఫలితాలు సూపర్ ఓవర్లో తేలాయి. అంతకుముందు 2013, 2019లో రెండేసి మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్లు జరిగాయి. ఈ సీజన్ ముందువరకూ ఐపీఎల్ మొత్తంలో తొమ్మిది మ్యాచ్‌ల ఫలితాలు సూపర్ ఓవర్లో తేలగా.. ఈ ఒక్క సీజన్‌లోనే 4 సూపర్ ఓవర్లు కనవిందు చేశాయి. అందులోనూ ఒక్క మ్యాచ్‌లోనే (పంజాబ్, ముంబయి ఇండియన్స్ మధ్య) రెండు సూపర్ ఓవర్లు నమోదవడం విశేషం. ఆ మ్యాచ్‌లో పంజాబ్ రెండో సూపర్ ఓవర్లో నెగ్గింది. దాని కంటే ముందు దిల్లీ, పంజాబ్.. ఆర్సీబీ, ముంబయి.. కేకేఆర్, సన్‌రైజర్స్ మ్యాచ్ ఫలితాలు సూపర్ ఓవర్లో తేలాయి.
చరిత్ర మార్చుకున్న చెన్నై..