తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: యూఏఈలో వేడి పుట్టిస్తున్న యువఆటగాళ్లు - ఇషాన్​ కిషన్

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో అనుభవంతులైన సీనియర్లు అంతంతమాత్రంగా రాణిస్తుంటే.. యువఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. అద్భుతమైన బ్యాటింగ్​తో అలరిస్తూ.. మ్యాచ్​ గమనాన్నే పూర్తిగా మార్చేస్తున్నారు. ఐపీఎల్​లో పరుగుల వరద సృష్టిస్తున్న యంగ్​క్రికెటర్లు ఎవరో తెలుసుకుందామా.

IPL 2020: Impressive Indian youngsters with amazing performances
ఐపీఎల్​: యూఏఈలో వేడి పుట్టిస్తున్న యువఆటగాళ్లు

By

Published : Sep 30, 2020, 8:40 AM IST

ఐపీఎల్‌ ముంగిట అందరి దృష్టీ బాగా పేరున్న, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మీదే ఉంటుంది. ఈసారి అందుకు భిన్నమేమీ కాదు. అందరూ స్టార్ల వైపే చూశారు. కానీ ఈ ఐపీఎల్‌లో అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకుంటోంది మాత్రం కుర్రాళ్లు, పెద్దగా పేరు లేని ఆటగాళ్లే. అంచనాల్ని మించి రాణిస్తున్న యువ, వర్ధమాన ఆటగాళ్లు ఐపీఎల్‌-13 స్టార్లది కాదు, తమది అని చాటుతున్నారు. ఐపీఎల్‌లో వేడి పుట్టిస్తున్న ఆ ఆటగాళ్లెవరో చూద్దామా..

సరికొత్త మయాంకం

3 మ్యాచ్‌ల్లో 221 పరుగులు (అత్యధికం 106)

మయాంక్​ అగర్వాల్​

మయాంక్‌ అగర్వాల్‌ భారత జట్టులో ఓపెనర్‌. పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్లలో అతడికి పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఐపీఎల్‌ విషయానికొస్తే అతను ఓ మోస్తరు ప్రదర్శనతో లీగ్‌లో ఉన్నానంటే ఉన్నాను అనిపిస్తూ వచ్చాడు. క్లాస్‌ ఆటగాడిగా ముద్ర పడ్డ అతను.. గతంలో మరీ దూకుడుగా ఏమీ ఆడలేదు. కానీ ఈసారి మాత్రం చెలరేగిపోతున్నాడు. తనలో ఇంతకుముందెన్నడూ చూడని విధ్వంసక కోణాన్ని చూపిస్తున్నాడు. దిల్లీతో తొలి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఆ ఇన్నింగ్స్‌ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం చూపిస్తూ 45 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. చక్కటి క్రికెటింగ్‌ షాట్లతోనే అతను విధ్వంసం సృష్టిస్తుండటం విశేషం.

సిక్సర్ల సంజు

2 మ్యాచ్‌ల్లో 159 (అత్యధికం 85)

సంజూ శాంసన్

సంజూ శాంసన్‌ ప్రతిభేంటో చాలా ఏళ్ల ముందే ఐపీఎల్‌లో చూశాం. కానీ తనపై పెరిగిన అంచనాల్ని తర్వాతి సీజన్లలో అందుకోలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం తొలి మ్యాచ్‌ నుంచే వీర విధ్వంసానికి దిగి అందరూ తన గురించి చర్చించుకునేలా చేస్తున్నాడు. టీమ్‌ఇండియాలో ఖాళీ అయిన ధోని స్థానాన్ని అందుకోవాలనో ఏమో.. సంజు చాలా పట్టుదలతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ అతను 70 దాటాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లోనే సంజు 16 సిక్సర్లు బాదేయడం విశేషం. ఈసారి అతణ్ని ఆపడం బౌలర్లకు సవాలులాగే ఉంది.

భవిష్యత్‌ తార

శుభ్​మన్​ గిల్​

టీమ్‌ఇండియాకు చాలా కాలం ఆడగల ఆటగాళ్లలో ఒకడిగా శుభ్‌మన్‌ గిల్‌ మీద క్రికెట్‌ వర్గాల్లో అంచనాలున్నాయి. ఈ తరం కుర్రాళ్ల మాదిరి అతను ఎడాపెడా షాట్లు ఆడే రకం కాదు. చక్కటి క్రికెటింగ్‌ షాట్లు ఆడుతూ క్రీజులో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యమిస్తాడు. పరిస్థితులకు తగ్గట్లు అవసరమైతే వేగం పెంచనూగలడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ.. సన్‌రైజర్స్‌తో రెండో మ్యాచ్‌ల్లో అంచనాల్ని మించి రాణించాడు శుభ్‌మన్‌. బలమైన బౌలింగ్‌ను ఎదుర్కొంటూ సంయమనంతో బ్యాటింగ్‌ చేసి 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. లీగ్‌ అంతా జోరు కొనసాగించి భారత జట్టులో మరిన్ని అవకాశాలు సృష్టించుకుంటాడేమో చూడాలి.

దేవ్‌దత్‌ పడిక్కల్‌

3 మ్యాచ్‌ల్లో 111 (అత్యధికం 56)

దేవ్​దత్​ పడిక్కల్​

అంచనాల్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్‌లోనే చక్కటి అర్ధశతకంతో మెరిశాడు కర్ణాటక కుర్రాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ . గత దేశవాళీ సీజన్లో ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారె టోర్నీల్లో టాప్‌స్కోరర్‌గా నిలిచి.. నిరుడు తనకు తుది జట్టులో చోటివ్వని బెంగళూరు యాజమాన్యం ఆలోచన మార్చుకునేలా చేసిన దేవ్‌దత్‌.. తొలి మ్యాచ్‌లో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడి ఆకట్టుకున్నాడు. రెండో మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ.. తర్వాతి పోరులో మళ్లీ ఓ అర్ధశతకం అందుకున్నాడు. మరి మున్ముందు ఈ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.

నయా మెరుపు

రెండు మ్యాచ్‌ల్లో 63 పరుగులు, 3 వికెట్లు

రాహుల్​ తెవాతియా

రాహుల్‌ తెవాతియా.. ఇప్పుడు ఐపీఎల్‌లో మార్మోగిపోతున్న పేరు. ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్‌తో అతను మామూలుగా మెరుపులు మెరిపించలేదు. ముందు పేలవంగా ఇన్నింగ్స్‌ ఆరంభించి.. ఆ తర్వాత ఒకే ఓవర్లో అయిదు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. మొత్తంగా ఏడు సిక్సర్లు బాది రాయల్స్‌కు అనూహ్య విజయాన్నందించాడు. తొలి మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్‌ బంతితో మాయాజాలం చేశాడు. ఐపీఎల్‌ ఆరంభానికి ముందు ఎవరూ పట్టించకోని తెవాతియా.. రెండు మ్యాచ్‌లతో చర్చనీయాంశంగా మారాడు. టోర్నీ ముగిసేవరకు అతను అందరి దృష్టిలో ఉంటాడనడంలో సందేహం లేదు.

వస్తూనే విధ్వంసం

ఇషాన్​ కిషన్

ఇషాన్‌ కిషన్‌ను తొలి మ్యాచ్‌ నుంచి ఆడించనందుకు ముంబయి బాధపడే ఉంటుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్కని ఈ కుర్రాడు.. మూడో మ్యాచ్‌తో మైదానంలోకి దిగడం దిగడంతోనే విధ్వంసం సృష్టించాడు. పెద్దగా అంచనాల్లేకుండా బెంగళూరుతో మ్యాచ్‌ ఆడిన అతను.. 58 బంతుల్లోనే 99 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లుండటం విశేషం. ఒత్తిడిలో అతను ఆడిన ఇన్నింగ్స్‌ ఈ ఐపీఎల్‌ అత్యుత్తమ బ్యాటింగ్‌ ప్రదర్శనల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఊపును అతను కొనసాగిస్తే టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ స్థానానికి పోటీదారుగా మారే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details