ఐపీఎల్లో లీగ్ దశ ముగిసింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ మంగళవారం జరిగింది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన దిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో నేడు తలపడనున్నాయి. ఇప్పటివరకు టైటిల్ గెలవని దిల్లీ ఈసారైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది.
దిల్లీ క్యాపిటల్స్
ప్రతి సీజన్లో విఫలమవుతున్న దిల్లీ ఈసారి సత్తాచాటింది. టోర్నీ ప్రారంభం నుంచి అదరగొట్టింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట గెలిచి 18 పాయింట్లు సాధించింది. కోచ్ పాంటింగ్, మెంటార్ గంగూలీ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. వీరి అనుభవం జట్టుకు పెద్ద బలం. 2012 తర్వాత ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం దిల్లీకి ఇదే తొలిసారి. ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఈ సీజన్లో 486 పరుగులు చేశాడీ ఓపెనర్. సారథి శ్రేయస్ అయ్యర్ 442 పరుగులు, పంత్ 401 పరుగులతో ఆకట్టుకుంటున్నారు. రబాడ దూరమైనా బౌలింగ్ లైనప్ బలంగానే ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్
కేవలం 12 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన జట్టుగా హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ప్రపంచకప్ దృష్ట్యా డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో స్వదేశానికి పయనమవడం హైదరాబాద్ జట్టుకు పెద్ద లోటుగా చెప్పవచ్చు. మనీష్ పాండే ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన గప్తిల్ ఎంత మేర ప్రభావం చూపగలడో వేచి చూడాలి. ప్రపంచకప్ జట్టులో అనూహ్యంగా చోటు సంపాదించిన విజయ్ శంకర్ అనుకున్నంతగా రాణించలేదు. ప్లేఆఫ్లోనైనా మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రత్యర్థి జట్టుకు సవాల్ విసరగల బౌలింగ్ విభాగం సన్‌రైజర్స్ సొంతం. రషీద్ ఖాన్, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న విలియమ్సన్ సారథ్య బాధ్యతలు చేపట్టడం జట్టుకు పెద్ద బలం.