తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెలరేగిన పంత్... రాజస్థాన్​పై దిల్లీ విజయం

జైపుర్ వేదికగా రాజస్ధాన్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగులుండగానే ఛేదించింది. పంత్(78), శిఖర్ ధావన్ అర్ధశతకాలతో రాణించారు. రాజస్థాన్ బ్యాట్స్​మెన్ రహానే శతకం వృథా అయింది.

పంత్

By

Published : Apr 22, 2019, 11:55 PM IST

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రిషభ్ పంత్ (78, 36 బంతుల్లో), శిఖర్ ధావన్ (54) అర్ధ శతకాలతో చెలరేగారు. జైపుర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగింది రాజస్థాన్. రహానే (105, 63 బంతుల్లో) శతకం వృథా అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా రిషభ్ పంత్ ఎంపికయ్యాడు.

192 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన దిల్లీకి శుభారంభం దక్కింది. శిఖర్ ధావన్ - పృథ్వీ షా జోడి తొలి వికెట్​కు 72 పరుగుల జతచేసింది. 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసిన ధావన్ ధాటిగా ఆడే ప్రయత్నంలో శ్రేయస్​ గోపాల్ బౌలింగ్​లో స్టంపౌట్ అయ్యాడు. అనంతరం పంత్ విజృంభించి జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. 26 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు పంత్. మరో పక్క పృథ్వీ షా నిలకడగా ఆడుతూ పంత్​కు సహకరించాడు. చివర్లో పృథ్వీ షా ఔటైనా.. అనంతరం ఇంగ్రామ్ సాయంతో పంత్ పని పూర్తి చేశాడు.

పంత్ పరాక్రమం..

12 బంతుల్లో 17 పరుగుల చేయాల్సిన తరుణంలో 19వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ తొలి ఐదు బంతులకు 5 పరుగులే ఇచ్చాడు. చివరి బంతిని పంత్ సిక్స్​ కొట్టి దిల్లీ విజయాన్ని ఖాయం చేశాడు. ఆఖరి ఓవర్లో ఏడు పరుగు అవసరం కాగా తొలి బంతిని సింగిల్ తీశాడు ఇంగ్రామ్, రెండో బంతిని సిక్సర్​గా మలచి నాలుగు బంతులు మిగులుండగానే దిల్లీకి విజయాన్ని చేకూర్చాడు పంత్.

రహానే శతకం వృథా...

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టులో రహానే శతకంతో అదరగొట్టగా.. స్మిత్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే రాజస్థాన్ బ్యాట్స్​మెన్ సంజూ శాంసన్ రనౌట్​గా వెనుదిరిగాడు. అనంతరం రహానే - స్మిత్ జోడి నిలకడగా ఆడుతూ స్కోరు వేగం పెంచింది. వీరిద్దరికి ధాటికి స్కోరు 200 దాటుతుందని రాజస్థాన్ అభిమానులు ఆశించారు. కానీ చివర్లో బ్యాట్స్​మెన్ వేగంగా పరుగులు చేయలేకపోయారు. దిల్లీ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, క్రిస్​ మోరిస్, ఇషాంత్ శర్మ తలో ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details