India Vs Pakistan Asia Cup : అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రీడాభిమానుల్లో ఎంతో క్రేజ్. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాల వల్ల రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. అయితే ఐసీసీ లేదా ఆసియాకప్ వంటి టోర్నీల్లోనో భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ చూసే భాగ్యం క్రీడాభిమానులకు దక్కుతోంది. తాజాగా మూడు నెలల వ్యవధిలో ఆసియాకప్, ప్రపంచకప్ వంటి టోర్నీల్లో పలుమార్లు ఈ ప్రత్యర్థుల పోరు వీక్షించే భాగ్యం అభిమానులకు కలగనుంది. ఈ క్రమంలో ఈ పోరు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..
ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు సెప్టెంబర్ 2న కొలంబో వేదికగా తలపడనున్నాయి. ఆ తర్వాత సూపర్-4 దశలోనూ ఇరుజట్లు పోటీపడే అవకాశం ఉంది. ఈ రెండు జట్లూ ఫైనల్‌కు చేరితే అక్కడ కూడా మనం దాయాదుల పోరు వీక్షించవచ్చు. మొత్తంగా ఆసియాకప్‌లో అన్ని అనుకూలిస్తే భారత్-పాకిస్థాన్ మధ్య మూడు వన్డేలను చూడవచ్చు.
Ind Vs Pak Asia Cup 2023 :రోహిత్ శర్మ సారథ్యంలో భారత్, బాబర్ అజామ్ నేతృత్వంలోని పాక్ మధ్య ఈ శనివారం జరిగే ఆసియాకప్ పోరు కోసం రెండు దేశాల అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్‌లో భారత్-పాక్ జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడగా.. ఏడు సార్లు భారత్, అయిదు సార్లు పాక్ గెలిచాయి. 2018లో తలపడ్డ రెండుసార్లూ టీమ్‌ఇండియానే పైచేయి సాధించింది. పాక్‌తో గత అయిదు ఆసియాకప్ మ్యాచ్‌ల్లో భారత్ నాలుగు సార్లు నెగ్గడం విశేషం. ఇది 16వ ఆసియాకప్. గత 15 ఆసియాకప్పుల్లో 13 వన్డే ఫార్మాట్లోనే జరిగాయి. రెండు సార్లు మాత్రమే టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. గత టోర్నీలో పొట్టి క్రికెట్ ఆడారు.