India Vs Afghanistan T20 Series 2024 Schedule : వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత టీమ్ఇండియా వచ్చే ఏడాది జాన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కోసం సన్నద్ధమవుతోంది. దాని కంటే ముందు సాధ్యమైనన్ని ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అందులో భాగంగా గురువారం (నవంబర్ 23) నుంచి ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. ఇప్పటికే జట్టును కూడా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ ప్రకటించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతోనూ టీ20 సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఇక ఆ తర్వాత అఫ్గానిస్థాన్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో మూడు టీ20ల సిరీస్ కోసం భారత్‌కు వస్తోంది. ఈ మేరకు తాజాగా అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
అఫ్గానిస్థాన్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్
టీమ్ఇండియా, అఫ్గాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జనవరి 11న మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరుగనుంది. ఇందౌర్ హోల్కర్ స్టేడియం వేదికగా రెండో మ్యాచ్‌లో ఇరు జట్లు పోటీ పడతాయి. చివరి టీ20 జనవరి 17న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగుతుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను అఫ్గాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే వైట్ బాల్ క్రికెట్లో ఇప్పటివరకు భారత్, అఫ్గాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆటకపోవడం గమనార్హం. ఇదే ఇరు జట్లకు తొలి ద్వైపాక్షిక సిరీస్. ఇప్పటివరకు ఈ రెండు జట్లు టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్‌ల్లో మాత్రమే తలపడ్డాయి.