తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి రోజు ఆట పూర్తి.. భారీ స్కోరు దిశగా భారత్.. సెంచరీ చేరువలో విరాట్​!

IND Vs WI Test 2023 : భారత్.. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా గురువారం రెండో టెస్టు మ్యాచ్​ ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన టీమ్ఇండియా ఓపెనర్లు అదరగొట్టారు. ప్రస్తుతం టీమ్ఇండియా స్కోర్ ఎంతంటే?

India Tour Of West Indies 2023
virat kohli test

By

Published : Jul 20, 2023, 10:55 PM IST

Updated : Jul 21, 2023, 6:44 AM IST

IND Vs WI Test 2023 : భారత్ - వెస్టిండీస్ మధ్య రెండో టెస్టులో టీమ్​ఇండియాకు అద్భుతమైన ఆరంభం దక్కింది. టాస్​ ఓడి బరిలోకి దిగిన రోహిత్​ సేన.. తొలి సెషన్‌లో విజృంభించింది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

విరాట్ కోహ్లీ 87 పరుగులను స్కోర్​ చేసి సెంచరీకి చేరువ కాగా.. రవీంద్ర జడేజా 36లు తమ బ్యాటింగ్​ స్కిల్స్​లో రాణించి క్రీజ్‌లో ఉన్నాడు. ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ యశస్వి జైస్వాల్​ ఇద్దరూ అర్ధ శతకాలు బాది మరోసారి మ్యాచ్​కు మంచి ఆరంభాన్ని అందించారు. మరోవైపు శుభ్‌మన్‌ గిల్, అజింక్య రహానె తొలి టెస్టు లాగే తక్కువ స్కోరుతో పెవిలియన్‌ చేరారు. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, గాబ్రియల్, వారికన్, జేసన్ హోల్డర్‌ తలో వికెట్ పడగొట్టారు.

తొలి సెషన్‌లో భారత్.. రెండో సెషన్‌లో విండీస్‌
India Vs West indies :తొలుత బరిలోకి దిగిన రోహిత్‌, జైస్వాల్ నిలకడగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. రోహిత్‌ ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడినా.. జైస్వాల్‌ మాత్రం మొదటి నుంచే తన దూకుడును ప్రదర్శించాడు. దీంతో అలవోకగా బ్యాటింగ్‌ చేస్తూ వచ్చిన ఓపెనర్లపై తొలి సెషన్లో విండీస్‌ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. షార్ట్‌ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తన ట్రేడ్‌ మార్క్‌ పుల్‌ షాట్‌తో రోచ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ సిక్స్‌ కొట్టగా.. జోసెఫ్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ బాల్​ను బౌండరీ దాటించాడు. ఇక తొలి గంటలో రోహితే ఎక్కువగా స్ట్రైక్‌ చేశాడు. గాబ్రియెల్‌ బౌలింగ్‌లో ఓ కళ్లు చెదిరే కవర్‌ డ్రైవ్‌తో బౌండరీ రాబట్టిన అతడు... 19వ ఓవర్లో రోచ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

మరోవైపు జైస్వాల్‌ కూడా తన దూకుడుతో అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఎదుర్కొన్న తొలి 29 బంతుల్లో 30 పరుగులు చేసిన అతడు.. 23వ ఓవర్లో జోసెఫ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో చెలరేగిపోయాడు. దీంతో లంచ్​ బ్రేక్​ సమయానికి టీమ్​ఇండియా 121/0తో నిలిచింది. ఆ తర్వాత విండీస్‌ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు పడగొట్టడం వల్ల టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ కాస్త గాడితప్పింది. రెండో సెషన్‌లో భారత్ 61 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. జేసన్‌ హోల్డర్‌ వేసిన 32 ఓవర్‌లో తొలి బంతికి ఫోర్‌ బాదిన యశస్వి.. నాలుగో బంతికి కిర్క్‌ మెకంజీకి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్.. కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ ద సిల్వాకు క్యాచ్‌ ఇచ్చాడు. శతకంపై కన్నేసిన రోహిత్‌ను స్పిన్నర్‌ వారికన్‌ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అజింక్య రహానెను గాబ్రియల్ వెనక్కి పంపాడు. దీంతో టీ విరామ సమయానికి 182/4తో నిలిచింది.

అతడు ఉన్నాడుగా..
Ind Vs WI 2nd Test :నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్‌ఇండియాను విరాట్‌ కోహ్లీ ఆదుకున్నాడు. జడేజా అందించిన సహకారం వల్ల క్రీజులో నిలకడగా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. కీమర్ రోచ్‌ వేసిన 60వ ఓవర్‌లో మొదటి రెండు బంతులను విరాట్ బౌండరీ దాటించాడు. ఇదే ఓవర్లో జడేజా కూడా ఓ ఫోర్ బాదాడు. వారికన్‌ వేసిన 67 ఓవర్‌లో ఫోర్ బాదిన కోహ్లీ టెస్టుల్లో 30వ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా నిలకడగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. రెండో రోజు కూడా కోహ్లీ ఇదే ఆటతీరును కొనసాగిస్తే భారత్‌ భారీ స్కోరు చేసే అవకాశముంది.

క్వీన్స్​ వేదికగా సాధించిన రికార్డులు ఇవే..

  • టెస్టుల్లో రోహిత్ శర్మ ఓపెనర్​గా 2,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
  • పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ ఈ మ్యాచ్​తో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. కాగా శార్దూల్ ఠాకూర్​కు విశ్రాంతినిచ్చి.. ముకేశ్​ను జట్టులోకి తీసుకున్నారు.
  • ఈ క్రమంలో ఓపెనర్లిద్దరూ.. ఓ రికార్డు దక్కించుకున్నారు. విదేశీ గడ్డపై టెస్టు సిరీస్​ల్లో.. వరుసగా రెండు సార్లు ఓపెనింగ్ శతక భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో జంటగా రోహిత్, జైస్వాల్ నిలిచారు. వీరి కంటే ముందు సునీల్ గావస్కర్/చేతన్ చౌహాన్, సెహ్వాగ్ /ఆకాశ్ చోప్రా, సెహ్వాగ్/వసీమ్​ జాఫర్ ఉన్నారు.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డుకెక్కాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికన్​ ప్లేయర్​ జాక్వెస్ కలిస్‌ను అధిగమించాడు.
Last Updated : Jul 21, 2023, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details