టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనపై చేసిన విమర్శలకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లెన్ మాక్స్‌వెల్ స్పందించాడు. వార్తల్లో నిలవడం కోసమే సెహ్వాగ్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నాడు. లీగ్‌లో పంజాబ్ తరఫున ఆడిన మాక్స్‌వెల్ 13వ సీజన్‌లో విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో మాక్సీ రూ.10 కోట్ల ఖరీదైన చీర్‌లీడర్ అని సెహ్వాగ్ ఘాటుగా విమర్శించాడు.
దీనిపై మాక్స్‌వెల్ స్పందిస్తూ.. " సెహ్వాగ్‌కు నేను నచ్చలేదు. అందుకే బహిరంగంగా విమర్శించాడు. తనకి నచ్చని దాని గురించే మాట్లాడే అధికారం అతడికి ఉంది. వార్తల్లో నిలవడం కోసం అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అయితే వాటిని నేను పట్టించుకోవట్లేదు" అని అన్నాడు.
'రాహుల్ భర్తీ చేస్తాడు'
భారత్‌తో స్వదేశంలో ఆస్ట్రేలియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. అయితే వైట్ బాల్ క్రికెట్ సిరీస్‌లకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దూరమవ్వడం తమకి కలిసొచ్చే అంశమని మాక్స్‌వెల్ అన్నాడు. క్లాస్ ఆటగాడు అయిన హిట్‌మ్యాన్ ప్రత్యర్థి జట్టులో లేకపోతే ఎవరికైనా సానుకూలాంశమేనని పేర్కొన్నాడు. కానీ రోహిత్ లోటుని ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ భర్తీచేస్తాడని అభిప్రాయపడ్డాడు. పంజాబ్ తరఫున రాహుల్-మయాంక్ అగర్వాల్ విజయవంతమైన భాగస్వామ్యాలు నెలకొల్పారని, వారిద్దరికి బలహీనతలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నాడు.
స్మిత్..సవాలే!
టీ20లతో పోలిస్తే వన్డే పరిస్థితులు భిన్నమైనవని మాక్స్‌వెల్ పేర్కొన్నాడు. "టీ20లతో పోలిస్తే వన్డేలు భిన్నం. బౌన్సీ పిచ్‌లు, పెద్ద మైదానాలతో భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెస్తాం. కాగా, టీమిండియాలోనూ గొప్ప బౌలర్లు ఉన్నారు. మహ్మద్ షమి కొత్త బంతితో పాటు పాత బంతితోనూ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అయితే స్టీవ్ స్మిత్ జట్టులోకి రావడం మాకు మరింత బలం. అతడు భారత్‌కు కఠిన సవాలుగా మారుతాడు. టీమిండియాపై అతడు రాణిస్తూనే ఉన్నాడు" అని మాక్సీ వెల్లడించాడు. భారత్-ఆసీస్ మధ్య తొలి వన్డే నవంబర్ 27న జరగనుంది.
ఇదీ చదవండి:లంక ప్రీమియర్ లీగ్ 'థీమ్సాంగ్' వచ్చేసిందోచ్..