సిడ్నీ వేదికగా శుక్రవారం భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. సమవుజ్జీల పోరు కావడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయమనిపిస్తోంది. అయితే ఐపీఎల్‌లో దాదాపుగా భారత ఆటగాళ్లు అందరూ సత్తాచాటడంతో టీమ్ఇండియా తుదిజట్టులో ఎవరికి అవకాశం లభిస్తుందని అందరిలో ఉత్కంఠ పెరిగింది. రాహుల్ బ్యాటింగ్ స్థానం, జట్టులో హార్దిక్ పాండ్య పాత్ర, ఓపెనర్లు, పేసర్లలో ఎవరెవరికి స్థానం దక్కుతుందని ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
రాహుల్ ఏ స్థానం ?
లీగ్‌లో అద్భుత ప్రదర్ననతో టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. అయితే అన్ని మ్యాచ్‌ల్లోనూ అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కాగా, ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అయిదో స్థానంలోనూ రాహుల్ సత్తాచాటాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 80 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అంతేగాక, తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లోనూ మిడిలార్డర్‌లో పరుగుల వరద పారించాడు. దీంతో ఆసీస్ మ్యాచ్‌లో రాహుల్ ఏ స్థానంలో వస్తాడనేది ఆక్తికరంగా మారింది. ఓపెనర్ రోహిత్ శర్మ గైర్హాజరీతో ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు మిడిలార్డర్‌లో వస్తాడని అంటున్నారు.
రాహుల్ మిడిలార్డల్‌లో బ్యాటింగ్‌కు వస్తే శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్‌లో ఒకరికి ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం వస్తుంది. ఇటీవల గిల్‌కు ప్రధాన కోచ్ రవిశాస్త్రి సూచనలు ఇస్తున్న ఫోటో నెట్టింట్లో వైరల్ కావడంతో మయాంక్‌కు నిరాశ తప్పదని భావిస్తున్నారు. అయితే మరోవైపు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ మయాంక్‌కు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు. దీంతో వీరిద్దరిలో ఎవరికి అవకాశం లభిస్తుందనేది ఆసక్తికరం. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తుదిజట్టులో ఉంటే బౌలింగ్ చేస్తాడా లేదా అనేది ప్రశ్న. ఐపీఎల్‌లో ముంబయి తరఫున ఆడిన అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం అతడు టీమ్ఇండియా దూరమైన సంగతి తెలిసిందే.