ప్రస్తుత టీమ్‌ఇండియా పేస్ దళం ప్రపంచంలోనే మేటిగా ఉందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేసన్ గిలెస్పీ అన్నాడు. త్వరలో భారత్ ఆ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. 2018-19 సీజన్‌లో కోహ్లీసేన ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలుపొందిన నేపథ్యంలో తాజాగా గిలెస్పీ.. స్పోర్ట్స్‌స్టార్‌తో మాట్లాడుతూ భారత పేసర్లను ప్రశంసించాడు. బుమ్రా, షమి, ఇషాంత్ బలమైన బౌలింగ్ యూనిట్ అని, ఈ ముగ్గురూ అత్యుత్తమంగా రాణిస్తున్నారని చెప్పాడు. కాగా, వీళ్ల కన్నా ముందు ఆడిన ఆటగాళ్లను కించపర్చడం లేదని మాజీ పేసర్ పేర్కొన్నాడు.
"బుమ్రా కెరీర్ ముగిసేలోపు అతడో సూపర్‌స్టార్ అవుతాడు. మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియా ఆల్‌టైమ్ అత్యుత్తమ పేసర్‌గా నిలుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక షమి విషయానికొస్తే అతడో అద్భుతమైన బౌలర్. ఇషాంత్ కూడా ఎంత ముఖ్యమైన ఆటగాడో నిరూపించుకున్నాడు. అతడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉన్నా తన విలువేంటో తెలియజేశాడు. నిత్యం తనని తాను మెరుగుపర్చుకుంటున్నాడు. ఆ విషయంలో టీమ్‌ఇండియా గర్వపడాలి. ఇక భువి, ఉమేశ్ యాదవ్‌లూ అద్భుతమైన పేసర్లే. ఒకప్పుడు జవగళ్ శ్రీనాథ్ టీమ్‌ఇండియాలో మెరిశాడు. ఆపై జహీర్ టీమ్‌ఇండియా పేస్‌కు వన్నె తెచ్చాడు. వాళ్లతో వీళ్లని పోల్చడం కష్టమే అయినా, బౌలింగ్ యూనిట్‌లో మాత్రం బలం పెరిగింది."