తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్రిస్బేన్​ టెస్టు: తలబడి నిలిచేనా.. ప్రత్యర్థిపై గెలిచేనా? - ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ 4

జట్టు నిండా గాయాలే. 11 మంది ఫిట్‌గా ఉన్న వాళ్లను సిద్ధం చేయడమే కష్టం ఉంది. దానికి తోడు క్వారంటైన్‌ కష్టాలు. ఆపై ఆడాల్సింది ఆస్ట్రేలియాకు అద్భుత రికార్డున్న గబ్బాలో. ఇన్ని ప్రతికూలాంశాలున్నా.. టీమ్‌ ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. క్లిష్టపరిస్థితుల్లోనూ సిడ్నీ టెస్టులో అసాధారణ పోరాటంతో చేసుకున్న డ్రా స్ఫూర్తినిస్తుంటే.. ఆతిథ్య జట్టుతో నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు సన్నద్ధమైంది. రేపటి నుంచే బ్రిస్బేన్​ వేదికగా టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.

India Vs Australia 4th test preview
బ్రిస్బేన్​ టెస్టు: తలబడి నిలిచేనా.. ప్రత్యర్థిపై గెలిచేనా?

By

Published : Jan 14, 2021, 8:56 AM IST

హోరాహోరీగా సాగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో రసవత్తర సమరానికి వేళైంది. శుక్రవారం నుంచే భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు. సిరీస్‌ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌పై చాలా ఆసక్తి ఏర్పడింది. గత మ్యాచ్‌ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత్‌ బరిలోకి దిగుతుంటే.. తమకు గొప్ప రికార్డున్న గబ్బాలో మరోసారి తమదే పైచేయి అవుతుందన్న ధీమాతో ఆతిథ్య జట్టు పోరుకు సిద్ధమైంది. మరి సిరీస్‌ ఎవరి సొంతమవుతుందో..!

పొంచి ఉన్న వాన

ఎంతో ఆసక్తిరేపుతున్న ఈ చివరి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం, సోమవారం వాన పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే వాన వల్ల రోజంతా ఆట ఏమీ తుడిచిపెట్టుకుపోవచ్చు. గబ్బా పిచ్‌పై బౌలర్లకు ఎక్కువ బౌన్స్‌ లభిస్తుంది. తన రహస్య అస్త్రాన్ని సంధించడానికి ఇక్కడి బౌన్సీ పిచ్‌ అనువుగా ఉంటుందని లైయన్‌ వ్యాఖ్యానించాడు.

భారత్‌కు గాయాల బాధ

అత్యంత అననుకూల పరిస్థితుల్లో, అత్యుత్తమ జట్టుతో ఆడకున్నా.. అద్భుత పోరాటంతో సిడ్నీ టెస్టును డ్రా చేసుకోవడం కచ్చితంగా టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. అది జట్టుకు అదనపు ఊపునిస్తుందనడంలో సందేహం లేదు. కానీ గాయాలు భారత్‌ను వేధిస్తున్నాయి. ఫిట్‌గా ఉన్న 11 మంది కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి. గాయాల వల్ల ఈ టెస్టులోనూ అనేక మార్పులతో దిగాల్సివస్తోంది.

మూడో టెస్టుతో మరో ముగ్గురు ఆటగాళ్లు గాయపడ్డ ఆటగాళ్ల జాబితాలో చేరారు. జడేజా, విహారి ఇప్పటికే చివరి టెస్టుకు దూరం కాగా.. ప్రధాన పేసర్‌ బుమ్రా ఆడడం కూడా సందేహమే. అతడు దూరమయ్యే అవకాశాలే ఎక్కువ. వికెట్‌కీపర్‌ పంత్‌ కూడా గాయపడ్డా మ్యాచ్‌ సమయానికి కోలుకోవచ్చు. అశ్విన్‌కూ వెన్ను నొప్పి ఉంది. కానీ అతడు కూడా మ్యాచ్‌లో ఆడగలుగుతాడని భావిస్తున్నారు. ఒకవేళ అతడు దూరమైతే కుల్‌దీప్‌ యాదవ్‌కు అవకాశం దక్కుతుంది. మయాంక్‌ కూడా గాయంతో ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో విహారి స్థానంలో వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా తుది జట్టులోకి రావొచ్చు. అప్పుడు పంత్‌ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడతాడు. వికెట్‌ కీపరైన సాహా.. కీపింగ్‌ చేస్తాడు.

ఆల్‌రౌండర్‌ జడేజా స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి రావడం దాదాపుగా ఖాయమే. ఆఫ్‌స్పిన్నరైన సుందర్‌.. ఉపయుక్తమైన బ్యాట్స్‌మన్‌ కూడా. బుమ్రా స్థానంలో సిరాజ్‌, సైనీలతో పేస్‌ భారాన్ని మోయడానికి శార్దూల్‌, నటరాజన్‌ల మధ్య పోటీ ఉంది. పరిమిత ఓవర్ల సిరీస్‌లో ప్రదర్శనతో ఆకట్టుకున్న నటరాజన్‌కే అవకాశాలు మెండు. ఇక బ్యాటింగ్‌లో రోహిత్‌, గిల్‌ మరోసారి శుభారంభాన్నివ్వడం జట్టుకు చాలా ముఖ్యం. రహానె ఫామ్‌ను అందుకోవాల్సివుంది. పుజారా, పంత్‌ మెరుగైన ప్రదర్శనను కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది.

టిమ్​పైన్​, స్టీవ్​ స్మిత్

గబ్బాలో ఆసీస్‌కు ఘన రికార్డు

గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకు ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 62 టెస్టుల్లో ఆ జట్టు 40 గెలిచింది. ఎనిమిది మాత్రమే ఓడింది. ఈ మైదానంలో లైయన్‌ 35 వికెట్లు పడగొట్టాడు. పేస్‌ బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌, కమిన్స్‌, హేజిల్‌వుడ్‌లు కలిపి 74 వికెట్లు చేజిక్కించుకున్నారు. ఇక్కడ ఆడిన గత రెండు టెస్టుల్లోనూ కంగారూ జట్టు ఇన్నింగ్స్‌ విజయాలు సాధించింది.

గబ్బాలో ఆ జట్టు చివరిసారి 1988లో (విండీస్‌ చేతిలో) పరాజయం చవిచూసింది. భారత్‌ మాత్రం ఇక్కడ ఆసీస్‌తో తలపడ్డ ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటీ నెగ్గలేదు. అయిదు మ్యాచ్‌ల్లో ఓడి, ఒకటి డ్రా చేసుకుంది. ప్రస్తుత టెస్టులో లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ల సూపర్‌ ఫామ్‌ ఆస్ట్రేలియాకు పెద్ద సానుకూలాంశం. ఓపెనర్‌ వార్నర్‌ గాడిన పడాలని ఆసీస్‌ ఆశిస్తోంది. బౌలింగ్‌లో ఆ జట్టుకు ఇబ్బందులేమీ లేవు. స్టార్క్‌, కమిన్స్‌, హేజిల్‌వుడ్‌, లైయన్‌లతో ఆసీస్‌ బౌలింగ్‌ దళం బలంగా కనిపిస్తోంది. భారత బ్యాట్స్‌మెన్‌కు మరోసారి గట్టి సవాలు తప్పదు. స్పిన్నర్‌ లైయన్‌కు ఇది 100వ టెస్టు కావడం విశేషం.

ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌..

ఆఖరి టెస్టు నేపథ్యంలో టీమ్‌ఇండియా తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. ఉదరకండరాల నొప్పితో నాలుగో టెస్టుకు దూరమైనప్పటికీ.. బుమ్రా బుధవారం సాధనలో జట్టుతో పాటు ఉన్నాడు. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రహానె.. ఇతర ఆటగాళ్లు ట్రెయినింగ్‌ కిట్స్‌తో కనిపించారు. బుమ్రా మాత్రం బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌తో మాట్లాడుతూ కనిపించాడు.

ఇదీ చూడండి:ముస్తాక్​ అలీ టోర్నీ: 37 బంతుల్లో సెంచరీ

ABOUT THE AUTHOR

...view details