తెలంగాణ

telangana

ETV Bharat / sports

జింబాబ్వేతో వన్డే సిరీస్​కు టీమ్​ఇండియా రెడీ, మరి ఛాన్స్‌ ఎవరికో..? - టీమ్​ఇండియా జింబాబ్వే వన్డే సిరీస్​

IND VS Zimbabwe టీమ్​ఇండియా-జింబాబ్వే మధ్య గురువారం నుంచి వన్డే సిరీస్​ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాలు.. ఇప్పటి వరకు ఇరు జట్లు ఆడిన సిరీస్‌లు.. ఆధిక్యం ఎవరనే విషయాలను తెలుసుకుందాం..

teamindia zimbabwe series
టీమ్​ఇండియా జింబాబ్వే సిరీస్​

By

Published : Aug 17, 2022, 8:20 PM IST

IND VS Zimbabwe కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా మూడు వన్డేల సిరీస్‌ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. గురువారం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఇటీవలే బంగ్లాదేశ్‌ను ఓడించి జింబాబ్వే మంచి ఊపు మీదుంది. ఈ క్రమంలో భారత్‌, జింబాబ్వే జట్ల బలాలు.. ఇప్పటి వరకు ఇరు జట్లు ఆడిన సిరీస్‌లు.. ఆధిక్యం ఎవరనే విషయాలను తెలుసుకుందాం..

సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, షమీ, రిషభ్ పంత్ తదితరులు లేకుండానే భారత్‌ బరిలోకి దిగనుంది. ఈ నెల చివరి నుంచి ఆసియా కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో వారందరికి విశ్రాంతి ఇచ్చింది. దీంతో కేఎల్ రాహుల్‌ - శిఖర్ ధావన్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా జింబాబ్వేను ఢీకొట్టనుంది. యువ బ్యాటర్లు రుతురాజ్‌, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్ కిషన్‌, సంజూ శాంసన్‌ వంటి ఆటగాళ్లకు తమ సత్తా నిరూపించుకునేందుకు మంచి అవకాశం వచ్చింది.

నిర్లక్ష్యం వ్యవహరిస్తే అంతే.. గత జింబాబ్వే జట్టును పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోయినా ఫర్వాలేదు కానీ.. ప్రస్తుతం వరుస విజయాలతో సంచలనాలు సృష్టిస్తున్న చకబ్వా రెగిస్‌ నాయకత్వంలోని జింబాబ్వేను తక్కువగా అంచనా వేయొద్దు. మరీ ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి వన్డే, టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. సికిందర్ రజా, కెప్టెన్‌ రెగిస్‌తోపాటు ఇన్నోసెంట్‌ కైయా అదరగొట్టేశారు. సెంచరీలతో జింబాబ్వేను గెలిపించారు. 300కిపైగా పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించారు. ఇక బౌలింగ్‌లోనూ రజా, మాదెవెరె, బ్రాడ్ ఇవాన్స్‌ వంటి బౌలర్లు రాణించారు. అందుకే జింబాబ్వేతో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

ఛాన్స్‌ ఎవరికో..? తుది జట్టులో ఎవరు ఉంటారనేది తొలి వన్డే జరిగే హరారే పిచ్‌ పరిస్థితిని బట్టి కోచ్ లక్ష్మణ్‌- కెప్టెన్‌ కేఎల్ రాహుల్ నిర్ణయిస్తారు. అయితే కేఎల్ రాహుల్-శిఖర్ ధావన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే గిల్‌, దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌/ఇషాన్‌ కిషన్‌ మిడిలార్డర్‌లో ఆడతారు. మిడిలార్డర్‌ కీలకం కాబట్టి సంజూ శాంసన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక ఆల్‌రౌండర్లు శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్, దీపక్‌ చాహర్‌ ఉంటే ఇటు బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో భారత్‌కు ప్రయోజనంగా ఉంటుంది. రెగ్యులర్‌ స్పిన్నర్లుగా కుల్‌దీప్‌ కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ముగ్గురు పేసర్లు అవేశ్ ఖాన్‌, ప్రసిధ్‌ కృష్ణ, మహమ్మద్‌ సిరాజ్‌ ఉన్నారు. వీరిలో ఇద్దరికి అవకాశం రావొచ్చు. సీనియారిటీ ప్రకారం సిరాజ్‌, ప్రసిధ్‌ ఛాన్స్‌ ఉంటుంది.

ఆధిక్యం ఎవరిదంటే..? ఇప్పటి వరకు భారత్‌ - జింబాబ్వే జట్లు ముఖాముఖిగా 63 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్‌ అత్యధికంగా 51 విజయాలను నమోదు చేయగా.. జింబాబ్వే కూడా 10 మ్యాచుల్లో గెలవడం విశేషం. మరో రెండు మ్యాచుల్లో ఎలాంటి ఫలితం తేలలేదు. ఇరు జట్లూ ఎనిమిది ద్వైపాక్షిక సిరీసుల్లో ఢీకొట్టగా.. ఏడింటిని భారత్‌, ఒక సిరీస్‌ను జింబాబ్వే సొంతం చేసుకున్నాయి.

* అత్యధిక స్కోరు: గుహవాటి వేదికగా 2002లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 333/6. దినేశ్ మోంగియా (159) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

* అత్యధిక వ్యక్తిగత స్కోరు: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్. 1983 ప్రపంచకప్‌లో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. 60 ఓవర్ల మ్యాచ్‌లో 138 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు.

* అత్యల్ప స్కోరు : భారత్‌ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 65 పరుగులకే కుప్పకూలింది. ఇర్ఫాన్‌ పఠాన్‌ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (5/27)

* అత్యధిక పరుగులు: జింబాబ్వేపై సచిన్‌ తెందూల్కర్‌ అత్యధికంగా పరుగులు సాధించాడు. 49.17 సగటుతో 34 మ్యాచుల్లో 1,377 పరుగులు చేశాడు.

* అత్యధిక వికెట్ల వీరుడు: అజిత్ అగార్కర్‌ జింబాబ్వేపై 26 మ్యాచుల్లో 45 వికెట్లు తీశాడు.

* అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్‌ ప్రదర్శన: జింబాబ్వేపై 2013లో జరిగిన వన్డేలో అమిత్ మిశ్రా (6/48) అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు.

ఇదీ చూడండి: ఆండ్రూ రస్సెల్ షాకింగ్​ కామెంట్స్​, బలిపశువును చేశారంటూ

ABOUT THE AUTHOR

...view details