Ind vs Wi T20 : భారత్‌తో టెస్టు, వన్డేల్లో తేలిపోయిన వెస్టిండీస్ జట్టు.. తొలి టీ20లో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మామూలు లక్ష్యాన్ని అందుకోలేని టీమ్ఇండియా.. అనేక విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. కాగా ఆదివారం జరగనున్న రెండో టీ20లో గెలిచి.. సిరీస్‌ను సమం చేయాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లు.. బ్యాటుతో రాణించి తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. మరి పెద్దగా బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని గయానా పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లను.. భారత కుర్రాళ్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్లో దుమ్మురేపిన ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్‌తో పటిష్ఠంగా టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్‌కు 150 పరుగుల లక్ష్యం ఓ లెక్క కాదు. కానీ తొలి టీ20లో వీరు క్రీజులో కుదురుకోడానికే చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో టీమ్ఇండియా యువ జట్టు బ్యాటింగ్‌లో చాలా మెరుగుపడాల్సి ఉందంటూ.. పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వీరి నుంచి ఫ్యాన్స్.. పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.
ఇక ఆసియా కప్, ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో.. నాణ్యమైన ఆట తీరుతో టీమ్ఇండియా యువ బ్యాటర్లు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య టచ్‌లోకి వస్తే.. ఛేదనలో భారత్‌కు ఇబ్బందులుండవ్. మొదటి మ్యాచ్‌లో అదరగొట్టిన తెలుగుతేజం తిలక్ వర్మ.. ఈ మ్యాచ్‌లోనూ ఫామ్ కొనసాగిస్తే భారత్‌కు భారీ స్కోర్ పక్కా. అయితే వీక్‌గా కనిపిస్తున్న లోయార్డర్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రాణించాల్సిన అవసరం ఉంది. ఇక టీ20ల్లో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆరాటపడుతున్నాడు యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్. మరి టీమ్ మేనేజ్మెంట్ అతడికి అవకాశం ఇస్తుందా అనేది ప్రశ్నార్థకం.
తొలి టీ20లో నెగ్గిన ఆతిథ్య విండీస్ జట్టు ఉత్సాహంగా కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్‌లో అంతంత మాత్రంగానే రాణించిన విండీస్.. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకుంది. కానీ రెండో మ్యాచ్ జరిగే ప్రావిడెన్స్ స్టేడియంలో వెస్టిండీస్ రికార్డులు పేలవంగా ఉన్నాయి. ఇక్కడ విండీస్ 11 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట గెలిచి, ఐదింట్లో ఓడింది. కాగా మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి.