IND Vs WI 1st T20 2023 : టెస్టు, వన్డే సిరీస్ తర్వాత భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 పోరుకు రంగం సిద్ధమైంది. ఆఖరి వన్డే జరిగిన వేదికపైనే నేడు(గురువారం) తొలి పోరు జరగనుంది. రాబోయే రోజుల్లో వరల్డ్ కప్ వరకు పూర్తిగా వన్డేలపైనే భారత్ దృష్టి పెట్టనున్న నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌లో తమ స్థానం పటిష్ఠం చేసుకోవాలనుకునే యువ ఆటగాళ్లకు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కీలకం కానుంది. రోహిత్, కోహ్లీలకు ముందే విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్‌లో కూడా హార్దిక్ పాండ్య నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగుతోంది. అయితే టీ20ల్లో అత్యధిక మంది ఆల్‌రౌండర్లున్న జట్టు విండీస్. నిమిషాల్లో మ్యాచ్ ఫలితాలు మారిపోయేలా విధ్వంసం సృష్టించడం కరీబియన్ క్రికెటర్లకు అలవాటే. కాబట్టి గురువారం తొలి టీ20లో టీమ్‌ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే.
చెలరేగిన పూరన్..
IND Vs WI 1st T20 West Indies : అమెరికాలో ఇటీవల ముగిసిన మేజర్ క్రికెట్ లీగ్ టోర్నీలో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్.. చెలరేగిపోయాడు. కేవలం 55 బంతుల్లోనే 137 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పూరన్.. ఏకంగా 13 సిక్సులు బాదేశాడు. టీ20ల్లో విండీస్ వీరులు ఎంత ప్రమాదకారులో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలా అని పూరన్ ఒక్కడే కాదు.. కైల్ మేయర్స్, రోమన్ పావెల్, హెట్‌మయర్, హోల్డర్, రోస్టన్ చేజ్, ఒడియన్ స్మిత్, రొమారియో షెఫర్డ్.. వీళ్లంతా కూడా ప్రమాదకారులే. వీరిలో హెట్‌మయర్ మినహా అందరూ ఆల్‌రౌండర్లే కావడం గమనార్హం.
తిలక్, యశస్వి అరంగ్రేటం
IND Vs WI 1st T20 Team India : టీ20 సిరీస్‌కు గాను.. టీమ్‌ఇండియా ఫైనల్ జట్టు ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ తప్పుకుని కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తొలి రెండు వన్డేల్లో తడబడ్డప్పటికీ.. చివరి మ్యాచ్‌లో యువ బ్యాటర్లు సత్తా చాటారు. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మతో పాటు మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో టీ20 అరంగేట్రం చేసే అవకాశముంది. శుభ్‌మన్‌తో కలిసి యశస్వినే ఓపెనింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడొచ్చు. సంజు శాంసన్ ఆడటం మళ్లీ అనుమానమే. అతడు ఆడాలంటే ఇషాన్ తన స్థానాన్ని త్యాగం చేయాలి. తిలక్ నాలుగో స్థానంలో ఆడతాడని అంచనా.