కొలొంబో వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో టీమ్ఇండియా ముందు 263 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది శ్రీలంక. నిర్ణీత ఓవర్లలో శనక సేన.. 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, చాహల్ తలో 2 వికెట్లు తీసుకున్నారు.
ఓపెనర్ల అండతో..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో- మినోద్ భానుక శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 49పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను యుజ్వేంద్ర చాహల్ విడగొట్టాడు. పదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన యుజీ.. తొలి బంతికే ఫెర్నాండో (32; 35 బంతుల్లో)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ పంపాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స(24; 22 బంతుల్లో) మినోద్ భానుక (27; 44 బంతుల్లో)కు సహకరించాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. భారీ స్కోరు చేసేలా కనిపించిన వీరిద్దరిని ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు కుల్దీప్ యాదవ్. అప్పటివరకు బాగానే ఉన్న శ్రీలంక రన్‌రేట్ ఆ తర్వాత పడిపోయింది. చరిత్ అసలంక(38; 65 బంతుల్లో), దసున్ శనక(39; 50 బంతుల్లో) ఆచితూచి ఆడారు.
చివర్లోమెరుపులు..
205 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన లంకను చివర్లో కరుణరత్నే, దుశ్మంత చమీరా ఆదుకున్నారు. ముఖ్యంగా కరుణరత్నే(35 బంతుల్లో 43 పరుగులు) చివరి ఓవర్లో విజృంభించాడు. భువీ వేసిన ఆ ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు బాదాడు. అందులో ఓ సిక్స్.. ఇన్నింగ్స్‌కే హైలైట్!
వికెట్ దక్కని భువీ..
పెద్దగా అంచనాలు లేని శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లో రాణించింది. దాదాపు బ్యాట్స్‌మెన్ అందరూ ఫర్వాలేదనిపించారు. చాహల్, కుల్దీప్లకు వికెట్లు పడ్డా.. సీనియర్ బౌలర్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్‌కు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. పైగా అందరికంటే ఎక్కువ ఎకానమీతో 9 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చాడు భువనేశ్వర్.
వాట్ ఏ కోఇన్సిడెన్స్..
భారత్-శ్రీలంక తొలి వన్డేలో ఓ వింత ఘటన జరిగింది. లంక రెగ్యులర్ కెప్టెన్ కుశాల్ పెరీరా గాయం కారణంగా సిరీస్‌కు దూరం కాగా.. దసున్ శనక టీమ్‌ను ముందుండి నడిపించాడు. ఇతడు లంక జట్టుకు 25వ కెప్టెన్. అలాగే టీమ్ఇండియాకు సారథ్యం వహించిన శిఖర్ ధావన్ కూడా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన 25వ ఆటగాడు కావడం విశేషం. ఇక లంక క్రికెటర్ మినోద్ భానుక, భారత ఆటగాడు ఇషాన్ కిషన్.. ఆయా జట్లకు 25వ వికెట్ కీపర్లు కావడం మరో విశేషం.
ఇదీ చదవండి:MS Dhoni: రైనా కిట్ బ్యాగ్‌ను ధోనీ మోసిన వేళ..